దేవుడు ఉన్నాడండీ...!
మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అభివృద్ధిని సాధించాడు. నక్షత్రాలకు, అంతరిక్షంలోని అనేక గ్రహాంతరాలకు నిచ్చెన వేస్తున్నాడు. వాతావరణాన్ని, అపరిచిత సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తున్నాడు. సముద్ర గర్భంలో సొర చేపవలే ఈదగలుగుతున్నాడు. సమాచార ప్రసారానికి అతివేగమైన పరికరాలను కనుగొని పూర్తి జగత్తునే ఓ గ్రామంగా మార్చగలిగాడు. ఇంత గొప్ప ప్రగతిని సాధించినప్పటికీ ఖుర్ఆన్ పేర్కొన్నట్టు ఒక్క ఈగను కూడా అతను సృష్టించలేడు. సృష్టించడం అతని తరం కాదు కూడా.
మానవుడు తన ఉనికి ఉద్దేశాన్ని మరచి, సృష్టి వెనుక దాగివున్న మర్మాన్ని విస్మరించి ఏమరుపాటుకి గురై జీవిస్తున్నాడు. ఎటువంటి సొంత ప్రమేయం, సంకల్పం, అధికారం లేకుండా అకస్మాత్తుగా భూమి అనబడే ఈ అపరిచిత ప్రాంతానికి తేబడ్డాడు. తల్లి గర్భంలో మూడేసి చీకటి పొరలలో రక్తం మరియు నీటి మధ్య కొట్టు మిట్టాడుతున్నప్పుడు ఈ లోకం గురించి గానీ, లోకంలోని సృష్టితాల గురించిగానీ బొత్తిగా తెలియదు అతనికి. అలా ఈ అవనిపై కాలు పెట్టిన మనిషి ఇక్కడ తనకు అవసరమైన ప్రతీది ఎంతో పొందికగా అందంగా అమర్చబడి ఉండటాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు.
ఓ అపరిచిత ప్రాంతానికి చేరుకున్న ఈ మనిషి తన ప్రమేయం లేకుండా అకస్మాత్తుగా ఆ ప్రాంతానికి తీసుకొచ్చి, తనకు కావాల్సిన వాటన్నిటినీ సమకూర్చి పెట్టిన ఆ సృష్టికర్త గురించి తెలుసుకునే బదులు, తన ఉనికికి గల ఉద్దేశాన్ని గ్రహించడానికి బదులు సృష్టి రహస్యాలు తెలుసుకోవాలన్న ఆత్రుతతో సృష్టికర్తనే మరిచాడు. అంతేకాదు, స్వయంగా సృష్టికర్తతో, ఆయన ఉనికిని చాటే ప్రవక్తలతో వాదోపవాదాలకి దిగాడు. సృష్టిని, సృష్టిలో జరిగే ప్రతి చిన్నా పెద్ద సంఘటనకు నేచర్ అన్న అందమైన పేరు కూడా ఇచ్చాడు. నేచర్ (ప్రకృతి) ఉందని విశ్వసించిన తను ఆ ప్రకృతి కూడా ఓ బలాఢ్యుడి అదుపాజ్ఞలకు లోబడి ఉందన్న సత్యాన్ని మాత్రం ఉపేక్షించాడు. వెలుగు, కాంతి, కిరణాలు, లేజర్స్ గురించి అనేక విషయాలను గ్రహించిన ఈ మనిషి. ఈ భూమ్యాకాశాలను వెలుగులతో నింపిన ఆ అఖండ జ్యోతీశ్వరుణ్ణి మాత్రం గ్రహించలేక పోతున్నాడు. కారణం తను ఆ దిశగా ఆలోచించలేదు. పరిశోధించలేదు. ఒక వేళ అతను ఆ దిశగా పురోగమించివుంటే నేడు అతని పూర్తి దశ మారిపోయి ఉండేది. ఖుర్ఆన్లోని ఈ సూక్తి అతని విషయంలో సత్యమయ్యేది: “మీలో (సత్యాన్ని) విశ్వసించి జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత హోదాలు ప్రసాదిస్తాడు." (ముజాదలా:11)
ఇక వివేకవంతుడైన ప్రతి వ్యక్తి ఈ లోకం నుండి, అందులోని మానవుని జీవితం నుండి అనేక పాఠాలు నేర్చుకోగలడు. అద్భుతమైన ఈ సృష్టి ఎన్నో హంగులతో అలరారుతోంది. ఓ వ్యక్తి పొట్టిగా ఉంటే, మరో వ్యక్తి పొడుగ్గా ఉన్నాడు. ఒకడు తెల్లగా మరొకడు నల్లగా అగుపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వ్యత్యాసాలో! అలా ప్రతి ఒక్క జీవి రూపు రేఖలు, స్వభావాలు, అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి.
ఓ సందర్భాన ఒక నాస్తికుడు ఇమామ్ షాఫయి (రహ్మ) గారినిలా ప్రశ్నించాడు: 'దేవుడున్నాడని నిరూపించగలిగే ఏ ఆధారమైనా మీ వద్ద ఉందా?'అని. అందుకాయన సమాధానమిస్తూ - మల్బరి ఆకు రుచి రంగూ ఒకే విధంగా ఉంటుంది. కానీ దాన్ని పట్టు పురుగు తింటే పట్టు వస్తుంది. తేనేటీగ తింటే తేనే లభిస్తుంది. మేక తింటే పాలిస్తుంది. లేడి తింటే కస్తూరి ఉత్పన్నమ వుతుంది. అలా ఒక్క మల్బరి ఆకు ద్వారా ఇన్ని విధాల వస్తువులు ఎవరు సృష్టించగలరు? ఈ కార్యం - ఆ చెట్లని, ఈ పురుగుని, ఈగను, మేకను సృజించిన ఆ ఒక్క సృజన కారుడికే సాధ్యం సుమా!" అన్నారు.
జ్ఞాన వివేకాలు గల ఏ వ్యక్తి అయినా సరే మానవ జీవితంలో అడుగడుగునా దర్శనమిచ్చే ఇటువంటి భిన్నత్వాల గురించి గనక ఆలోచిస్తే ఖచ్చితంగా తను సత్యాన్ని చేరుకోగలడు. కనుక మనలోని ప్రతి ఒక్కరూ తన ఉనికిని గురించి, తన శరీర నిర్మాణం గురించి, తన కోసం ఉనికిలోకి తేబడిన ఈ సృష్టి బ్రహ్మాండం గురించి ఆలోచించాలి. తర్కించి పరిశోధించి చూడాలి.
ఉదయం లాంటి హృదయాన్ని అడుగు
నిత్యం ఏకాంత క్షణాన్ని అడుగు
పచ్చికలో మంచు ముత్యాలను అడుగు
తలను నిమిరే వ్రేళ్ళను అడుగు
నెమలి పింఛపు రంగులను అడుగు
కోయిల కమ్మని స్వరాన్ని అడుగు
చక్కటి చల్లని జాబిలిని అడుగు
సృష్టిలో ఆణువణువూ సాక్ష్యమిస్తుంది దేవుడున్నాడని.
మానవ శరీరమనే ఈ రక్త మాంసాల ముద్ద సైతం ఎవరి అధీనంలో ఉంది? తనవారి విషయంలోగానీ, పరాయివారి విషయంలోగానీ, ఇతర జీవరాసుల విషయంలోగానీ మనిషికి ఎటువంటి అధికారమైనా ఉందా? లేదు అంటే ఎందుకు ఈ మిడిసిపాటు? ఇదే ప్రశ్న ఖుర్ఆన్ సైతం మనిషికి వేస్తోంది.... ఓ మానవుడా! దయాకరుడైన, కరుణా సాగరుడైన నీ ప్రభువుని గురించి నిన్నే విషయం మోసంలో పడేసింది? ఆయనే కదా నిన్ను పుట్టించి, నిన్ను తీర్చిదిద్దాడు. నిన్ను తగిన విధంగా రూపొందించాడు. తాను తలచిన ఆకారంలో నిన్ను (అందంగా) మలిచాడు." (ఇన్సితార్: 6-8)
“ఆయనే కదా (మాతృగర్భాల్లో) మీ రూపు రేఖల్ని తాను తలచిన విధంగా రూపొందించింది." |
(ఆలి ఇమ్రాన్: 5)
“ఆయనే కదా మీ కోసం నేలను పాన్పు గాను, నింగిని కప్పుగాను చేశాడు. పైనుంచి వర్షాన్ని కురిపించేవాడు కూడా ఆయనే. ఆ వర్షం ద్వారా ఆయన రకరకాల పండ్లూ, పంటలు పండించి మీకు ఉపాధిని అనుగ్రహిస్తున్నాడు." (బఖర: 22)
"ఏమిటి? నిన్ను మట్టితో, వీర్య బిందువుతో సృజించి పరిపూర్ణ మానవుడిగా రూపొం దించిన ఆ (అపూర్వ) సృజనకారుడినే తిరస్కరిస్తున్నావా?” (కహఫ్: 37)

