Wednesday, August 3, 2022

యువకులతో యుక్తితో వ్యవహరించాలి


వివేకాన్ని వీడి వ్యసనంలోకి ... 

మనిషి మనుగడకు, చరిత్ర ఉత్తేజమగుటకు సమాజాభివృద్ధికి యువతరం చాలా అవసరం. సమాజం నిరంతరం ప్రవహించేనదిలాంటిది. నదిలోకి వచ్చిన కొత్తనీరు పొలాల్లోకి ప్రవహించి సస్యశ్యామలం చేస్తుంది. సమాజం పాతకొత్తల మేలు కలయిక.శరీరంలోకి కొత్తరక్తం ఎక్కినప్పుడు అది ఎలా పుష్టినిస్తుందో అలాగే ప్రతి యుగంలో జరిగే మార్పునకు యువత నవ్యత్వానికీ భవ్యత్వానికి తోడ్పడుతుంది.భారతదేశ భవిష్యత్తుకు వెన్నుముకగా నిలవాల్సినయువత నేడు ఐసు గడ్డలా  కరిగిపోతున్నారు. భారతదేశానికున్న గొప్ప సంపద యువత. యువశక్తి అద్వితీయమైనది. అనన్య సామాన్య మైనది. ఆవేశాన్ని అరికట్టి ఆలోచనను పెంపొందించుకొని సరైన మార్గంలో యువతరం నడిస్తే మన దేశం  స్వర్గసదృ శమే. ఆధారంలేని వారికి ఆసరాగా నిలవాలి. ఆర్తులైనవారికి ఆనం దంపంచాలి. వ్యవహారిక శైలిలోనూ, భవిష్యత్తు వ్యవహారాలోచన లోనూ మార్పురావాలి.  



విద్య, నైతిక విలువలు కలిసి ప్రయాణించాలి. చదువుతోపాటు మంచి సంస్కారవం అలవడాలి.  ఆకర్షణ కంటే హితమైనదానిని ఎంపిక చేసుకోవడం యువత నేర్చుకోవాలి. మత్తుపదార్ధాల వలలో పడితే బయట పడటం దుర్లభమని, జీవితం అర్ధాంతరంగా ముగుస్తుందని, భవిష్యత్తు నాశనం అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. 


తల్లిదండ్రులు రేయింబవళ్లు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో ఉన్నత చదువులు చదివిన యుతరంలో 20శాతం మాత్రమే తమ లక్ష్యాల సాధనలో పయనిస్తున్నారని 40శాతం యువకులు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోలేక సమాజాన్ని నిందిస్తూ అచేతనంగా ఉంటున్నారని ఒక సర్వేలో తేలింది. మరో 40శాతం యువత మద్యం, గంజాయి, కొకైన్‌ లాంటి మత్తు పదార్థాలకు లోనై, అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారని ఆ సర్వేలో పేర్కొంది. ప్రత్యేకించి గత ఏడాది కాలంలో అసాంఘిక కార్యకలాపాల్లో యువకుల ప్రమేయం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. పట్టుపని 16ఏళ్ల వయస్సు దాటని నూనూగు మీసాల యువకులు మద్యం మత్తులో కూరుకుపోతున్నారు. మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న యువకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో పోలీసులకు పట్టుపడుతున్నవారిలో అత్యధికులు యువకులే ఉంటున్న తీరు పరిస్థితి

తీవ్రతకు అద్దం పడుతోంది.


యువ చైతన్యమే సమాజానికి రక్ష..

దురలవాట్లు, పెడధోరణలకు అలవాటుపడిన యువకులను చైతన్యపరచవలసిన బాధ్యత సమాజంలోని అన్నివర్గాలపైనా ఉంది. స్వచ్ఛంద సంస్థలు మొదులుకొని తల్లిదండ్రుల వరకు యువత నడవడికపై దృష్టిసారించాలి. డ్రగ్స్‌, మత్తుమందు, మద్యం, గంజాయిలాంటి మత్తుపదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ యువతను చైతన్యపరచాల్సి ఉంది. స్వాతంత్య్ర ఉద్యమాలకాలం నుంచి అనేక విముక్తి పోరాటాలకు, విప్లవోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచి, నిన్నటి మొన్నటి అనేక హక్కుల  సాధన పోరులోనూ యువత అగ్రగామి పాత్ర పోషించింది. ఇదీ యువతరం శక్తి. అలాంటి యువతను నిరాశ నిస్పృహలకు గురికాకుండా, దురలవాట్లకు లోనుకాకుండా కాపాడుకోవడం ద్వారా భావి సమాజాన్ని నిర్మించుకోవాలి. 


అది ప్రియ ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధి. నూనూగు మీసాల ఓ యువకుడు సహాబా ప్రోగై ఉన్న ఆ సత్సమావేశంలో అందరికీ సగౌరవంగా సలాము చేసి ప్రవేశించాడు. మాట ప్రారంభిస్తూ - ప్రవక్త (స) వారినుద్దేశించి - యా రసూలల్లాహ్! తమరు నాకు వ్యభిచార అనుమతి ఇస్తారా? 

ఒక్క సారిగా అందరి మీద పిడుగు పడ్డట్టయింది. ప్రియ ప్రవక్త (స) ఉన్నారన్న గౌరవంతో మౌనంగా ఉన్నారే గానీ,   కట్టలు తెచ్చుకున్న కోపంతో అందరూ చూపులతోనే నిప్పులు కురిపిస్తున్నారు. 

ప్రవక్త (స), కుర్రాడి దుస్సాహసానికి ఏం తీర్పు ఇవ్వనున్నారో? అని ఉత్కంఠభరితులై ఎదురు చూస్తున్నారు.ప్రశ్న అడిగిన  ఆ నవ యువకుడు సైతం సహాబా  ముఖ కవళికలు మారడం చూసి బిత్తరపోయాడు.. తనకు  ఎలాంటి సమాధానం వస్తుందోనన్న  అందోళనకు గురై ఉన్నాడు..!! ప్రవక్త (స) వారి అధరాల నుంచి ప్రేమపూరిత పలుకులు జాలువారాయి. బాబూ! ఇటురా...! దగ్గరకొచ్చి కూర్చొ..!!!


 సహాబా అందరూ నివ్వర పోయి చూస్తున్నారు.. నాలుగు తగిలించా ల్సిందిపోయి నగుమోముతో పలుకరించడమా....! చెంపలు వాయించాల్సిందిపోయి చెంతకు చేర్చుకోవడమా.... బయటికి గెంటాల్సిందిపోయి లోనికి ఆహ్వానించడమా...! అంటూ తర్జనభర్జనలు పడు తున్నారు.


ప్రవక్త (స): చూడు బాబూ! నీ ప్రశ్నకు జవాబు ఇచ్చేముందు నా ప్రశ్నకు బదులివ్వు. 

ప్రవక్త(స): బాబూ! ఏ కార్యం కోసం అయితే నీవు అనుమతి కోరుతూ ఇక్కడికి వచ్చావో ఆ కార్యాన్ని నీ తల్లికోసం ఇష్టపడతావా?

నవ యువకుడు: లేదు, లేదు. ప్రవక్త (స) పోని నీ చెల్లికోసం నవయువకుడు: ఛీ, ఛీ.. కాదు, కాదు, సరే నీ పిన్ని కోసం? 


నవయువకుడు: అపచారం! అపచారం! నావారైన ఎవరి కోసమూ దీన్ని ఇష్టపడను. (లోహాన్ని మలచాలంటే సుత్తి తీసుకొని కొడితే కుదరదు. ముందు వేడి చేయాలి. ఆ తర్వాత అనుకూలంగా మలచుకోవాలి.) అలాగే ప్రవక్త ఇటువంటి కొన్ని ప్రశ్నలతో వ్యభిచారం అంటే అతనికే అసహ్యం కలిగేలా చేశారు. ఆ పిదప హితపు చేయడానికి సరైన సమయం ఇదేనని భావించి ఇలా అన్నారు.


ప్రవక్త (స) చూడు బాబూ! నీవు ఎలాగైతే నీ తల్లి, చెల్లి, పిన్ని కోసం వ్యభిచారాన్ని ఇష్ట పడటం లేదో, అలాగే జనులు సైతం తమ తల్లి, చెల్లి, పిన్ని కోసం ఈ నీచకార్యాన్ని సుతరాము ఇష్ట పడరు. కాబట్టి బాబూ! నామాట విను. చెడు ఆలోచనల్ని విసర్జించు, సౌశీల్యవంతుడవని అన్పించుకో' అంటూనే తన మృదువైన చేయిని ఆ నవ యువకుడి రొమ్ముపై పెట్టి ' ఓ అల్లాహ్ ఈ నూనూగు మీసాల  యువకుడిని సౌశీల్యవంతమైన జీవితం ప్రసాదించు' అని ఆశీర్వదించారు. దీవెనలు కురిపించారు. ఆ రోజు మొదలు ఆ యువకుడు సమకాలీకుల్లానే గొప్ప సౌశీల్యవంతుడనిపించుకున్నాడు. అటువంటి శీలవంతుణ్ణి మేము చూడలేదు అని అప్పటి ప్రజలు కితాబు ఇచ్చారు.


ప్రవక్త (స) వారి కాలం నాటి ఈ సంఘటన వల్ల మనకు అవగతమయ్యేది ఏమిటంటే..


1) 'ప్రతిదీ భయపెట్టి, చెంపలు వాయించి చేపించాలి' అన్న థియరీ సరయైనది కాదు.  పనులు ప్రేమతోనే సాధ్యమవుతాయి. . అప్పుడప్పుడు కాసింత మందలింపు, దండన అవసరమే.


 2) యువకుల్లో అధికశాతం టీజింగ్ చేసే స్వభావం ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళు చెడ్డాళ్ళు, పనికిమాలినోళ్ళని కాదు అర్థం. యువకుల మనస్తత్వాలు తెలిసిన పేరెంట్స్, గురువులకి వారి టీజింగ్, పరిహాసంలో సైతం, గొప్ప ప్రతిభ కనబడుతుంది. ఆ మీదట వారిని ఉత్తమ హితవులతో గొప్ప పౌరులుగా తయారు చేస్తారు కూడా. అలాగే పని చేయటం లేదు అని నోరుపారేసు కోవడం, చేయి చేసుకోవడం మాని, ఆ పని ఎలా చేయాలో, ఆ పని చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో ప్రేమగా విడమరచి చెబుతారు. భవిష్యత్తును భూతద్దంలో చూపించి బెదరగొట్టడం మాని జీవితాన్ని ప్రేమించడం. పవిత్ర జీవన మకరందాన్ని ఆస్వాదించడం నేర్పిస్తారు.


3) మన పిల్లలు మన వద్దకు వచ్చి సైన్స్ గురించి. గానీ, కామర్స్ గురించిగానీ, సెక్స్ గురించి గానీ, సెన్సెక్స్ గురించిగాని, ప్రేమ గురించి గానీ, క్కమం గురించి గానీ, కామన్సెస్ గురించి గానీ, పెళ్ళి గురించిగానీ, జాతీయం గురించిగానీ, అంతర్జాతీయం గురించిగానీ చర్చించినప్పుడు- ఏమిటిడి నాన్సెన్స్ అని మనం విసుక్కోక అసలు వాళ్లు మనల్నే ఎందుకు సంప్రదించారు? మన పట్ల గౌరవం, మర్యాద లేకపోతే వారు మనతో ఇలా అడిగివారేనా? అని ఆలో చించాలి. మనల్ని వారు ప్రేమిస్తున్నారు. అభిమానిస్తున్నారు. గౌరవిస్తున్నారు. మన మాటకు విలువ ఇస్తున్నారు కాబట్టే తమ సమస్యలు మనతో వచ్చి చెప్పుకుంటున్నారు. కన్నవారం అయిన మనమే వారి మనో భావాల్ని అర్ధం చేసుకోక, మరేదోలా భావించి దురుసుగా ప్రవర్తిస్తే పాపం వాళ్ళెక్కడికి వెళ తారు? వారి మనోభావాల్ని అర్ధం చేసుకుని, వారి సమస్యల్ని ఎవరు పరిష్కరిస్తారు?కనుక  మన పిల్లలు మనతో చెప్పే మాటలు, వారికి ఎదురయ్యే సమస్యలు ఎంత తీవ్రమైనవైనా వాటికంటూ ఓ పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది.


మనం చేయాల్సిందల్లా ఓర్పు, నేర్పుతో వారి వాదనల్ని విని, పెద్ద మనసుతో అర్థం చేసుకొని, సమస్యను మన కోణం నుంచి కాకుండా, వారి కోణం నుంచి చూసి యోచించి యుక్తితో పరిష్కరించడమే. ఇది మీరు చెప్పేంత సులభం కాదు అని మీరు అనవచ్చు. మీరన్నది నిజమే కావచ్చు. కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. సాధనతో మన సంతానాన్ని సంరక్షించుకుంటామో, సోమరితనం, లక్ష్యం, అహంకారంతో  పోగొట్టుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి.