Monday, January 26, 2015
Tuesday, January 13, 2015
జననీ జనకుల సేవ
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ
అల్లాహ్ తర్వాత మన ఉనికి కారకులు తల్లిదండ్రులు. మన సుఖం కోసం తమ సుఖాన్ని, మన హాయి నిద్ర కోసం వారి హాయి నిద్రను త్యాగం చేెసిన త్యాగధనులు మన తల్లిదండ్రులు. మన సంతోషాన్ని తమ సంతోషంగా, మన బాధను తమ బాధగా భావించిన ధన్యజీవులు మన తల్లిదండ్రులు. మహా పర్వతం అంతటి ప్రేమను పిల్లలందరికీ పంచి పెట్టగలిగే పిచ్చి గుండెలు ఎవరివి? అని అడిగితే, సందేహమే లేదు; అవి మన జననీ జనకులవే. తమ భవితవ్యాన్ని మరచి మన భావికి బాట వేసి, మన బంగారు భవిష్యత్తు గురించి కలలు గనే కరుణా స్వరూపులు ఎవరు? అంటే సంశయమే లేదు; వారు మన అమ్మానాన్నలే.అట్టి మమతామూర్తుల్ని గౌరవించడం, అభిమానిం చడం, వారి మాటకు శిరసా వహించడం సంతానంగా మనందరి కర్త వ్యం అంటున్నాడు అల్లాహ్‌ా:
''అల్లాహ్‌ా తీర్మానం చేెసేశాడు. (ఇదే అంతిమ తీర్పు). మీరు ఆయన్ను తప్ప మరెవ్వరినీ పూజించకూడదు. తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవ హరించాలి. ఒకవేళ వారిలో ఒక్కరుగానీ, ఇద్దరుగానీ ముదిమి థకు చేెరుకుని ఉంటే వారిని 'ఉఫ్' అని కూడా అనకూడదు. వారితో మర్యా దపూర్కంగా మాట్లాడాలి. వారి కోసం నీ రెక్కలను వాత్సల్యంతో వంచి ఉంచాలి. వారి కోసం సదా ఇలా ప్రార్థిస్తూ ఉండాలి: ''ప్రభూ! వారు నన్ను బాల్యంలో ఎంత కరుణతో, ఎంత వాత్సల్యంతో పెంచారో వారిపై సయితం అటువంటి కరుణనే కురిపించు''. (బనీ ఇస్రాయీల్: 23) అవును అమ్మానాన్నల రుణం తీర్చుకునేంతటి ధర్మాత్ముడు, ధన వంతుడు ఇప్పటికెవరూ పుట్టలేదు. పుట్టబోరు కూడా.
ఒకసారి హజ్రత్ అబ్దుల్లాహ్‌ా బిన్ ఉమర్ (ర) గారు ఓ యమన్ దేశ స్థుడిని తన వీపు మీద తల్లిని ఎత్తుకుని కాబా ప్రదక్షిణ చేస్తూ చూశారు. హజ్రత్ అబ్దుల్లాహ్‌ా బిన్ ఉమర్ (ర) గారిని చూడగానే, అతను - 'ఓ ఉమర్ పుత్రుడా! నేను నా తల్లి రుణం తీర్చేశానంటారా?' అని అడిగాడు. అతని మాట విన్న ఆయన - ''నువ్వు ఆమె రుణం తీర్చడం మాట అలా ఉంచు, నిన్ను జన్మనిచ్చినప్పుడు ఆమె తీసుకున్న ఒక్క ఉచ్శ్వాసకు బదులు రుణాన్ని కూడా చెల్లించ లేదు'' (ఆమె నిన్ను నవ మాసాలు మోసి, కని, పాలు పట్టి, పెంచినదానికి నువ్వేం రుణం తీర్చుకోగలవు) అన్నారు.
ప్రసవ సమయంలో తల్లి పడిన ప్రయాసను స్వయంగా పరమ ప్రభు వయిన అల్లాహ్‌ా ప్రస్తావించాడంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించ వచ్చు: ''మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము. అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలు విడిపించడా నికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవయి ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే''. (లుఖ్మాన్: 14)
కాలం ఆగకుండా ఉంటుందా చెప్పండి! రూపు రేఖలు మారకుండా ఉంటాయా? చెప్పంటి! తల్లిదండ్రుల తలలు ముగ్గు బుట్టలవుతాయి. ముఖాలు మడతలు పడతాయి. కంటి చూపు సన్నగిల్లుతుంది. చేతులు పట్టు సడలుతుంటే, కాళ్లకు వణుకు వస్తుంది. అప్పుడు మన అవసరం వారికి ఇంకా అధికంగా ఉంటుంది. కాబట్టి మన జన్మ కారకులయిన జననీ జనకులను సేవించుకొని వారి దీవెనల్ని పొందాల్సిన అవసరం పిల్ల యిన మనందరికి ఉంది. ఆ విషయానికొస్తే మన స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, అవి మన ఇంట్లోనే ఉన్నాయి.
''అల్లాహ్‌ా ప్రసన్నత తండ్రి ప్రసన్నతలో ఉంది'' అని ఓ సందర్భంలో చెబితే, ''తండ్రి స్వర్గపు మధ్యస్థ తలుపు'' అని మరో సందర్భంలో అన్నారు ప్రవక్త (స). ఈ తలుపు గుండా స్వర్గంలో ఎవరు ప్రవేశిస్తారో తెలుసా? తల్లిదండ్రుల సేవలో తరించి సజ్జన సంతానం.
ఒకసారి ఓ వ్యక్తి వచ్చి -'నేను జిహాద్లో పాల్గొనాలనుకుంటున్నాను' అని కోరగా, అతని వృద్ధ తల్లి బ్రతికుందని తెలుసుకున్న ప్రవక్త (స) - ''నువ్వు ఆమెను అంటి పెట్టుకుని ఉండు (ఆమె సేవలో తరించు). స్వర్గం ఆమె పాదాల చెంత ఉంది'' అన్నారు. (నసాయీ)
తల్లిదండ్రుల స్థానం మహా గొప్పది. వారి యెడల అనుచితంగా వ్యవ హరించడం మహాపరాధం-కబీరా గునాహ్ా. అయితే నేటి యువత ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్త్తోంది.
సమయం రాత్రి 12 గంటలు కావస్తోంది.. ఓ వృద్ధ మహిళ సముద్ర ఒడ్డున కూర్చుని ఉంది. అటుగా వెళుతూ ఓ యువకుడు - 'అవ్వా! ఏమిటి. ఈ సమయంలో ఇక్కడ ఉన్నావేంటి?' అని ఆరా తీశాడు.
'ఏమీ లేదు నాయానా! నా కొడుకు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లాడు'. గంట, రెండు గంటలు గడచినా ఎవరూ రాకపోయే సరికి ఉండ బట్టలేక వెళ్లి అడిగాడు. అదే సమాధానం; 'కొడుకు వస్తుంటాడు, వస్తాడు'. అంతలో ఆ కుర్రాడి దృష్టి ప్రక్కనే పడి ఉన్న ఓ కాగితం మీద పడింది. 'అవ్వా! ఈ కాగితం నీదే అయితే, నేను చదవచ్చా?' అని అడిగాడు. 'ఈ కాగితం నా కొడుకు వెళుతూ నాకిచ్చి-ఎవరయినా వచ్చి పలుకరిస్తే వారికివ్వు' అని పురమాయించి మరీ వెళ్ళాడు. ఏముంది బాబు అందులో? అంటూ ఆత్రంగా చూడసాగింది ఆ వృద్ధ మహిళ. అందులో ఏం వ్రాసి ఉందో తెలుసా?
''ఈ ముసలావిడ ఎవరికి దొరికినా వారు దయచేసి ఆమెను వృద్ధాశ్ర మానికి తరలించండి!''....
ఇదా మనం మన తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం? ఇదా మనం వారితో వ్యవహరించాల్సిన తీరు? ఇదా మనం వారి సేవలకు ఇచ్చే గుర్తింపు? అసలు మనకు అల్లాహ్‌ా అంటే భయం లేదా? సంఘటన ఇదొక్కటే అనుకొంటే పొరపాటు. కోర్టుల్లో నడిచే కేసుల్ని, వైద్యాల యాల్ని, వృద్దాశ్రమాల్ని మనం వెళ్లి సందర్శించినట్లయితే ఇటువంటి హృదయ విదారక సంఘటనలు ఎన్నో...! ఎన్నెన్నో!!
సుభక్తాగ్రేసరుల్లో అగ్రగణ్యులయిన ప్రవక్తలు సదా తల్లిదండ్రుల సేవలో తరించారు. ప్రవక్త నూహ్‌ా (అ) అల్లాహ్‌ాను ఇలా వేడుకుంటు న్నారు: ''ప్రభూ! నన్ను నా తల్లిదండ్రులను క్షమించు''. (నూహ్: 28)
ప్రవక్త ఇబ్రాహీమ్ (అ), ప్రవక్తలందరి పితామహులు. తండ్రి విగ్రహా రాధకుడయినా ఆయనతో ఎంతో సౌమ్యంగా మాట్లాడేవారు. ఆస్తి పాస్తుల నుంచి బేదఖలు చేసిన, ఇంటి నుండి గెంటేసిన, ఊరి నుండి వెలివేసిన సందర్భం అది.అట్టి క్లిష్టస్థితిలో సయితం తండ్రితో మార్యాద పూర్వకంగానే మాట్లాడుతున్నారు.''నాన్నా! మీరెందుకు షైతాన్ని ఆరాధి స్తున్నారు? కరుణామయుని వద్ద నుండి ఏదయినా విపత్తు మీపై విరు చుకు పడుతుందేమోనని నేను భయ పడుతున్నాను''. (మర్యమ్: 19)
ఒక వైపు ఇంటి నుండి శాశ్వతంగా గెంటేస్తున్న తండ్రి. ఎక్కడికెళ్ళాలి? ఎలా బ్రతకాలి? అని ఆలోచించకుండా, ఉడుకు రక్తంతో దూకుడుగా వ్యహరించకుండా, తన గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, నాన్నే మయిపోతాడోనన్న బెంగతో బాధ పడుతున్న కొడుకు మరోవైపు...
ప్రవక్త యహ్యా (అ). ఆయన గురించి స్వయంగా అల్లాహ్‌ా ఇస్తున్న కితాబు ఇది: ''అతను అతని తల్లిదండ్రుల యెడల సద్వ్యవహారం కలిగినవాడు. వారి పట్ల కర్కశంగా, కఠినంగా, దుర్మార్గంగా వ్యవహరి ంచేవాడు కాదు''. (మర్యమ్:1 4)
ప్రవక్త ఈసా (అ) చెబుతున్న మాట: ''అల్లాహ్ నాకు చేసిన మహో పదేశం-నేను నా తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. వారికి విధేయుడిగా జీవించాలి'' అని. (మర్యం:32)
తల్లిదండ్రుల నిద్రకు భంగం వాటిల్లకూడదని పాలు నిండిన పాత్రను చేతిలో పట్టుకొని రాత్రంగా వారి పాదాల చెంతనే గడిపి ఉదయం వారు లేచాక వారి ఆకలిని తీర్చి ఆ తర్వాత తన ఆలుబిడ్డల ఆకలిని తీర్చిన సుమతులు మన పూర్వీకులు.
హజ్రత్ అబు హురైరా (ర) ఇంట్లో ప్రవేశించినప్పుడల్లా తల్లిని ఉద్దే శించి - 'మీరు నన్ను ఎంత కరుణా వాత్సల్యంతో పెంచారో అల్లాహ్‌ా అటువంటి కరుణనే మీపై కురిపించుగాక!' అని దుఆ చేసేవారు. బదులుగా ఆయన తల్లి కూడా - ''బాబూ! ముదిమి థలో నన్నేంతో ప్రేమగా చూసుకుంటున్న నిన్ను కూడా అల్లాహ్‌ా చల్లగా చూడు గాక!'' అని దీవించేది.
హసన్ బస్రీ (ర), తల్లిని ఎంతగా గౌరవించేవారంటే, ఆమెతో కలిసి ఒకే పళ్ళేంలో భోంచేసేవారు కాదు. ఎందుకనుకుంటున్నారు? తన తల్లికి నచ్చిన ఏదేని ఆహార పదార్థాన్ని ఆమెకన్నా ముందు తానెక్కడ తినేస్తానేమోనన్న భయం.
సజ్జనులయిన మన పూర్వీకుల్లో కొందరయితే, ఏ ఇంటి క్రింది భాగం లో తల్లి ఉండేదో, ఆ ఇంటి పై భాగంలో వారు నివాసముండే వారు కాదు. కష్ట పడి సంపాదించిన రోజు కూలిని నాన్నకు ఇచ్చే సమయం లో సయితం ఆయన చేయి క్రింద ఉండకూడదు అన్న గొప్ప గౌరవ భావంతో బల్ల మీద పెట్టి వెళ్ళేవారు. ఫలితంగా అల్లాహ్‌ా వారిని ఎంత గా సన్మానించాడో, ఎన్ని కీర్తిశిఖరాలకు తీసుకెళ్ళాడో చరిత్రే సాక్షి!
మనలో ప్రవక్త (స) వారి సహచర్యాన్ని కోరుకోని వారు ఎవరుం టారు చెప్పండి! సహాబా మహా గొప్ప అదృష్టవంతులు అని, ముందు వారు, ముందున్నవారు అని మనం నమ్ముతాము. అలాంటి భాగ్యానికి దూరమయ్యారు యమన్ దేశానికి చెందిన ఉవైస్ అల్ ఖర్నీ (ర). కార ణం ఏమయి ఉంటుందనుకుంటున్నారు? 'వృద్ధురాలయిన తన తల్లి సేవ'! హజ్జ్ మహారాధన చేసుకునే అదృష్టం దక్కాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆయనకూ హజ్జ్ చెయాలని ఉన్నా తల్లి బ్రతి కుండగా హజ్జ్ చేయలేకపోయారు. కారణం-'తల్లి సేవ'! అంతగా ఆయన తల్లిని సేవలో తరించారు గనకే నయం కాని కుష్టు రోగాన్ని అల్లాహ్‌ా నయం చేశాడు. ఆయన పేరు తీసుకొని మరీ ప్రవక్త (స) స్వయంగా ఆయన్ను ప్రశంసించారు. అంతే కాదు - ''యమన్ నుండి ఉవైస్ ఖర్నీ అనేె వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. అతను తన తల్లి యెడల ఉత్తమంగా వ్యవహ రించేవాడు. ఓ ఉమర్! నువ్వే గనక అతన్ని చూస్తే నీ కోసం ప్రార్థించ మని చెప్పు. నేను చెప్పానని చెప్పు'' అని తాకీదు చేసారు.
ఆధ్యాత్మిక రంగానికి చెందిన మహా ఉద్ధండులయిన ఉమర్ (ర) ఆయన వచ్చేంత వరకు వేచి ఉండటమే కాక, ఆయన వచ్చాక ఆయన్ను కలిసి తన కోసం ప్రార్థించ వలసిందిగా కోరారు. ఓ మామూలు స్థాయికి చెందిన ఆయన్ను అంతటి మహోన్నత స్థాయికి చేర్చిన విషయం ఏది? అదే 'తల్లి సేవ'! నేడు సయితం మనకు ఎంతో మంది తారస పడుతుం టారు. చాలా సింపుల్‌గా కనిపించే వారు చాలా గొప్ప గొప్ప హోదాల్లో రాణిస్తుంటారు. పూర్వపరాల్ని పరిశీలిస్తే ఆర్హతతోపాటు వారు తల్లిదం డ్రులకు చేసుకునే సేవే వారిని ఆ స్థాయిలో కూర్చోబెట్టిందని అర్థమవు తుంది.
అమ్మానాన్నల దీవెనలు ఇహంలోనూ ప్రతిఫలిస్తాయి. పరంలోనూ ప్రతి ఫలిస్తాయి. ఆదే వారి యెడల దురుసుగా వ్యవహరించేవారు, దుర్మార్గంగా నడుచుకునే వారు, వారిని తిట్టేవారు, కొట్టేవారు పురు గులు పట్టి పోతారు. వారికి మించిన దౌర్భాగ్యులు మరొకరు లేరు. ''వాడు నాశనం గాను, వాడు నాశనం గాను, వాడు నాశనం గాను'' అని మూడు సార్లు ప్రవక్త (స) అభిశపించారు. అది విని కంగారు పడిన సహచరులు ఇంతకీ ఆ దౌరాగభగ్యుడు ఎవరో? సెలవియ్యండి ప్రవక్తా! అని విన్నవించుకున్నారు. అందుకాయాన-వృద్ధ థలో తల్లి దండ్రుల్ని పొంది కూడా (వారి సేవ చేసుకొని) స్వర్గానికి వెళ్ల లేని వాడు'' అన్నారు. (ముస్లిం)
అవును అలాంటి వాడు ఇంటికి బరువు, సమాజానికి బరువు, దేశానికి బరువు, భూమికే బరువు. అందుకే వేమన అన్నాడు:
తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుఁడు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అని.
సమాధి సంగతులు
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ
''సమాధులు పెళ్ళగించబడినప్పుడు..ప్రతి ఒక్కరికీ తాను ముందుకు పంపుకున్నదీ, వెనక వదలి పెట్టినదీ (అంతా) అర్థమయిపోతుంది''. (ఇన్ఫితార్: 4-5) మనోరంజక సుఖ సౌఖ్యాలతో కూడుకున్న ఈ మూన్నాళ్ళ మచ్చట తీరిన తర్వాత రాబోవు మజిలీలు మనిషిని ముచ్చెమటలు పట్టిస్తాయి. ప్రాంచిక వ్యామోహం, అధికంగా పొందాలన్న ఆత్రం, అత్యాశ, అతని లో లోభత్వాన్ని పెంచి అల్లాహ్‌ా ఆదేశాల పట్ల, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి సంప్రదాయాల పట్ల అశ్రద్ధ వహించేలా చేసింది. అలా అన్ని విధాల పరధ్యానానికి గురైన మనిషి ఆశల ఆరాటంలోనే, కాంక్షల దాస్యంలోనే కాటికి చేరుకుంటాడు. ఎంత దర్జాగా తను బతికినా, వందల ఎకరాల్లో చూపరుల్ని కట్టి పడేసే ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్నా, కనీస అవసరాలయిన కూడు, గూడు, గుడ్డకు సయితం నోచుకోక జీవించినా చావు గుటక వేయ వలసిందే. ఎంతో గారాబంగా పెంచుకున్న ఆరగడుల అందమ యిన శరీరం ఎంత ఇష్టం లేక పోయినా కాటి మట్టిలో కలిసిపోవల సిందే! ఎంత విశాలమయిన భవనాల్లో నివాసం ఉండినా, ఆరడుగుల సమాధిలో ఎంత అసౌకర్యంగా ఉన్నా, ఏ సౌకర్యం లేకుండా అడ్జస్ట్ అవ్వాల్సిందే!! ''ప్రతి ప్రాణీ మృత్యు రుచి చవి చూడాల్సిందే''. (ఆల్ ఇమ్రాన్: 185)
మరణం అనే ఘట్టం ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంది. ఇరుకయిన ఈ కనుమ గుండా ప్రతి ఒక్కరూ పయనించాల్సిందే. వింత ఏమిటంటే, అది ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో తెలీదు, ఎవరూ తేల్చి చెప్పనూ లేరు. ఇదే యదార్థాన్ని కుర్ఆన్ ఇలా పెర్కొంటుంది: ''తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. మరియు తాను ఏ గడ్డపై మరణిస్తుందో కూడా ఏ జీవికి తెలీదు. అల్లాహ్‌ాయే అన్ని తెలిసినవాడు, సర్వజ్ఞుడూను''. (లుఖ్మాన్: 34)
ఎవరి చావు ఎలా ఉన్నా, చావు తీవ్రత మాత్రం చాలా భయంకరమ యినది. హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (ర) వంటి వారే ''ఓ అల్లాహ్‌ా! నా మరణ పీడనలోని తీవ్రతను తగ్గించు స్వామీ!'' అని వేడుకునేవారంటే అదెంత యాతనతో కూడినదయి ఉంటుందో ఆలో చించండి!
మరణం ఓ పీడనయితే, సమాధి దానికన్నా పెద్ద యాతన. ''నేను సమాధికాన్న దుర్భరమయిన, ఆందోళనకరమయిన స్థలం మరొకటి చూడలేదు'' అని స్వయంగా మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారు సెల వియ్యడమే కాక, ''సమాధి యాతన నుండి అల్లాహ్‌ా శరణు కోరు కోండి'' అని నొక్కివక్కాణించారు. ''మీరు సమాధుల్లో దజ్జాల్ ఉపద్రవం నుండి పరీక్షించబడినట్లు పరిక్షించ బడతారు''. అన్నారు ప్రవక్త (స).
హజ్రత్ అబ్దుల్లాహ్‌ా బిన్ అబ్బాస్ (ర) ఇలా అన్నారు: ''సమాధి ఉప ద్రవం నుండి శరణు వేడుకునే ప్రార్థనను ప్రవక్త (స) వారు, మాకు ఖుర్ఆన్లోని సూక్తులు నేర్పించినట్లు నేర్ఫించేవారు''. అలాగే మనం రోజూ ఐదు ఫుటల నమాజులలో చదివే దుఆలలో - ''ఓ అల్లాహ్‌ా నిశ్చయంగా నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను'' అన్నది ఒకటి. ప్రవక్త (స) వారు సమాధి యాతన నుండి శరణు వేడు కోని రోజంటూ లేదు'' అన్నారు హజ్రత్ ఆయిషా (ర.అ).
హజ్రత్ ఉస్మాన్ (ర) గారయితే సమాధి ప్రస్తావన వస్తే చాలు బోరున విలపించేవారు. ఎంతగా ఏడ్చేవారంటే ఆ అశ్రువుల ధాటికి గడ్డం తడిసిపోయేది. 'నరక ప్రస్తావన వచ్చినప్పుడు కూడా తమరు ఇంతగా విలపించరే! మరి, సమాధి ప్రస్తావనతో ఎందుకు భయకంపితులవు తున్నారు' అని కొందరు అడగ్గా - ''పరలోక మజిలీలలో తొలి మజిలి సమాధి. ఈ ఘట్టాన్ని అవలీలగా దాటగలిగితే తర్వాతి ఘట్టాలు వాటం తట అవే సులభతరమయిపోతాయి. ఇక్కడ ముక్తి లబించని వానికి తర్వాతి ఘట్టాలు ఇంకా దుర్భరంగా ఉంటాయి'' అనేవారు.
హజ్రత్ ఉమర్ (ర) గారు సమాధిని, పరలోక జీవితాన్ని గుర్తు చెసుకుని ఎంతగా ఏడ్చేవారంటే, ఆయన ముఖం మీద చారలు ఏర్ప డ్డాయి. ప్రవక్త (స) వారి నోట సమాధి యాతన తాలూకు సంగతులు విని హజ్రత్ అబూ జర్ గిఫారీ (ర)- ''అయ్యో! నేను చెట్టునయి ఉంటే ఎంత బాగుండేది. ఎవరి చేతనయినా కోయబడేవాడిని'' అని అంటుం డేవారు.
హజ్రత్ అబూ హురైరా (ర) గారికి మరణ ఘడియ సమీపించినప్పు డు ఆయన బోరున విలపించ సాగారు. అది చూసిన ప్రజలు - 'ఏమండి! ప్రపంచాన్ని వదిలి పెట్టి వెళ్ళాలిస్స వస్తున్నందుకు విలపిస్తు న్నారా?' అని అడిగారు. దానికాయన -
''కాదు, ప్రయాణం చూస్తే బహు సుదీర్ఘమయినది. నా దగ్గరేమో ప్రయాణ సామగ్రి అంతంత మాత్రమే ఉందాయే! అందుకని నా ఈ పరలోక ప్రస్థానం ఎలా సాగుతుందన్న బెంగతో ఏడుస్తున్నాను. ప్రస్తు తం నేను ఎదుర్కోబోతున్న స్థితిగతుల ఉపమానం ఎలాంటిదంటే - ''నేనొక ఎత్తయిన గుట్ట మీద నుంచుని ఉన్నాను. దాని ఆవల స్వర్గమ యినా ఉంది, నరకమయినా ఉంది. వాటిలో నా గమ్యస్థానమేదో నాకే తెలియని అయోమయ స్థితి'' అని విచారం వ్యక్తం చేశారు.
ధర్మఖలీఫాలో జుగ్రజులయిన హజ్రత్ అబూ బకర్ (ర) గారు మర ణాన్ని, సమాధిని తలచుకుని ఎంతగా భయపడేవారో ఆయన ఈ వేడు కోలు ద్వారా అంచనా వేయవచ్చు: ''దేవా! నా పరిస్థితి ఎలా ఉండబో తుందో! నా వద్ద చెప్పుకోదగ్గ ఒక్క సత్కర్మ లేకపాయే! నా దుష్కర్మలు చూస్తే చాలానే ఉన్నాయి. దీనికి తోడు విధేయత సామగ్రి కొరత మాత్రం కొట్టుకొచ్చినట్లు కనబడుతుందాయే!!
భయంకరమయిన సమాధి ఇరుకయిన కనుమను తలచుకుని సజ్జను లయిన మన పూర్వీకులు అంతగా కంపించిపోతుంటే, మనం మాత్రం రోజూ ఎవరో ఒకరిని కాటికి సాగనంపుతూ కూడా ఘోరమైన ఏమరు పాటుకి లోనయి జీవిస్తున్నాము. మరణం, మరణానంతర జీవతం తాలూకు చింతనే మనలో లేకుండా పోతుంది. ''ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినా వారు ఏమరుపాటుకి లోనయి విముఖులయి జీవిస్తున్నారు''. (అన్బియా: 1)
ఓసారి దైవప్రవక్త (స) తన ముందు నుంచి ఒక శవం పోతుంటే చూసి - ''సౌఖ్యాన్ని పొందేవాడు లేదా సౌఖ్యాన్న ఇచ్చేవాడు'' అన్నారు. విషయం అర్థం అవ్వక అనుచరుల 'అంటే ఏమిటి దైవప్రవక్తా! అని అడగ్గా- ''విశ్వాసి చనిపోయాక ఐహిక కష్టాల నుండి విముక్తి పొంది అల్లాహ్‌ా కారుణ్య ఛాయలో సౌఖ్యం పొందుతాడు. పాపాత్ముడు చనిపోతే, ప్రజలు, ప్రాంతం, పట్నం, దేశం, చెట్టు, చతుష్పాదాలు, సర్వానికి అతని కీడు నుండి విముక్తి కలుగుతుంది'' అని సమాధానమి చ్చారు ప్రవక్త (స. (బుఖారీ)
పాఠక మహాశయులారా! మనం మరణించాక మన జనాజా మోసుకె ళ్ళేందుకు కనీసం నలుగురు వ్యక్తులయినా మనస్ఫూర్తిగా ముందుకు రావాలంటే నలుగురికి మేలు చేసినప్పుడే, నలుగురిలో మంచిగా వ్యవహరించినప్పుడే అది సాధ్యం. కాదు, కూడదు అంటే మాత్రం 'పీడ విరగడయ్యింది' అంటూ దాటి పోతారు. ఇదే యదార్థాన్ని ఓ కవి ఇలా అన్నాడు: ''ఓ ఆదం పుత్రుడా! అది నువ్వే - నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడుస్తూ ఉంటే, నీ చుట్టూ ఉన్న ప్రజలు సంతోషంతో నవ్వుతుండే వారు. నువ్వు నీ స్వయం కోసం ఎలాంటి సత్కర్మల సామగ్రిని సమకూర్చుకోవాలంటే, నీవు మరణించిన నాడు వారందరూ శోక సముద్రంలో మునిగి ఉండగా నువ్వు మాత్రం నవ్వుతూ ఈ లోకాన్ని వీడాలి''.
''వారు ఎన్నో తోటలను, ఎన్నో ఊటలను వదలి పోయారు. మరెన్నో పచ్చని పొలాలను, చక్కని నియాలను. ఇంకా తాము అనుభవిస్తూ ఉండే విలాసవంతమయిన వస్తువులను (వదలిపోయారు). అంతా ఇట్టే అయిపోయింది. మేము మరో జాతి వారిని వాటన్నింటికీ వారసులుగా చేశాము. వారి స్థితిపై నింగీ ఏడ్వలేదు, నేలా విలపించలేదు. వారికి (కనీసం) గడువు కూడా లభించలేదు''. (అద్దుఖాన్: 25-29)
దీనికి భిన్నంగా ''విశ్వాసి మరణిస్తే, 40 రోజుల వరకు భూమ్యాకాశాలు, సృష్టిలోని చరాచరాలు రోధిస్తాయి'' అని ప్రవక్త (స) అన్నారు. పరలోక శిక్ష అంటే, ప్రళయం రావాలి. తీర్పు దినం నెలకొనాలి. ఆ తర్వాతే శికాబహుమానాలు అన్న భ్రాంతిలో ఉంచే ప్రయత్నం చేస్తాడు షైతాన్. తస్మాత్ జాగ్రత్త! స్వర్గనరకాల తీర్పు ప్రళయ దినాన ఇవ్వ బడినా, 'కోర్టు తీర్పు వెలువడనంత వరకూ నేెరస్థుడు జైల్లో అనుభ వించే శిక్ష వంటిదే సమాధి శిక్ష. అసలు నరక యాతన చవి చూడక ముందు దైవదూతలతో నడ్డి విరగ్తొట్టుకొని తీర్పు దినం వరకూ సమాధి లో దుర్భర జీవితం గడపవలసి ఉంటుంది. ఇదే ఘట్టాన్ని గుర్తు చేస్తూ ప్రవక్త (స) అన్నారు: ''సమాధి స్వర్గవనాలలోని ఓ వనం లేదా నరక కూపాల్లోని ఓ కూపం''. (తిర్మిజీ)
మరణ ఘడియ సమీపించాక పశ్చాత్తాపం చెందడం వల్ల ప్రయో జనం లేదు. దుఆ ద్వారాలు ప్రళయ సమయంలో పడమర నుండి సూర్యుడు ఉదయించేంత వరకు తెరవబడే ఉంటాయన్నది నిజమే. కానీ 'ప్రతి మనిషి తాలూకు ప్రళయం అతని మరణమే' అన్నది కూడా అక్షర సత్యం. ఆ ఘడియ సమీపించినప్పుడు అవిధేయుల స్థితిని వర్ణిస్తూ ఖుర్ఆన్ ఇలా అంటుంది: ''చివరికి వారిలో ఎవరికయినా చావు మూడినప్పుడు అతను (పశ్చాత్తాపంతో) 'ప్రభూ! నేను వదలి వచ్చిన ప్రపంచంలోకి నన్ను మరో సారి పంపించు. నేనిప్పుడు నా ప్రవర్తన మార్చుకుని, సత్కార్యాలు చేస్తాను' అంటాడు. అలా ఎన్నటికీ జరుగదు. అతను పనికిమాలిన మాటలు వదరుతున్నాడు. (చని పోయిన) వారందరి వెనుక ఇప్పుడొక అడ్డు తెర (బర్‌జఖ్) ఏర్పడింది. పునరుత్థాన దినం వరకూ వారా స్థితిలోనే ఉంటారు''. (దివ్య ఖుర్ఆన్-23: 99,100)
కాబట్టి మనందరి ప్రభువు మనల్ని ఎంతో ప్రేమతో ఇస్తున్న పిలుపు ఇది: ''మీలో ఎవరికయినా చావు వచ్చి - 'నా ప్రభూ! నాకు మరి కొంత గడువు ఇవ్వలేదెందుకు? (ఇచ్చి ఉంటే) నేను కూడా ధాన ధర్మాలు చేసి సజ్జనులలో చేరేవాడిని కదా!' అని (కడు దీనంగా) పలికే దుస్థితి దాపురించక ముందే మేము మీకు ప్రసాదించిన దాని నుండి (మా మార్గంలో) ఖర్చు చేయండి. ఏ ప్రాణికయినా, దాని నిర్థారిత సమయం ఆసన్నమయ్యిందంటే, ఇక అల్లాహ్‌ా ఎట్టి స్థితిలోనూ దానికి గడువు ఇవ్వడు''. (మునాఫిఖూన్: 10,11)
కరుణించు! కరుణించబడతావు!!
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ
అల్హమ్దులిల్లాహ్! మనమందరం కరుణామయుని దాసులం. మనం దరి ప్రభువు కరుణామయ ప్రభువు. మనందరి ధర్మం కారుణ్య ధర్మం. మనందరి గ్రంథం కారుణ్య గ్రంథం. మనందరి ప్రవక్త కారుణ్య ప్రవక్త. మనందరి సముదాయం కరుణించబడిన సముదాయం. మనం ఏది చేయాలనుకున్నా, ఏది చదవాలనుకున్నా 'బిస్మిల్లాహి ర్రహ్మానిహ్రీమ్'-అనంత కరుణామయుడు, అపార దయానిధి అయిన అల్లాహ్‌ా పేరుతో అని చెప్పడం ఆనవాయితి. కరుణ అల్లాహ్‌ా గుణం. కరుణామయుడు-రహ్మాన్-రహీమ్ అల్లాహ్‌ా నామం.అల్లాహ్‌ా కారుణ్యం ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ''అల్లాహ్‌ా తన కారుణ్యాన్ని వంద భాగాలుగా విభజించాడు. అందులో 99 భాగాలు తన వద్ద పెట్టుకొని ఒక భాగాన్ని సమస్త లోకాల్లో అవతరింపజేశాడు. ఓ క్రూర జంతువు తన బిడ్డను ప్రేమతో, కరుణావాత్సల్యంతో స్పృశించడం ఆ ఒక్క భాగ కరుణ ఆధారంగానే. అలాగే మీరు పరస్పరం కనబరచుకుంటున్న కరుణ సయితం అందులోనిదే''. (బుఖారీ)
అంతటి దయాసాగరుడయి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (స) వారి గురించి ఇస్తున్న కితాబు -''ఓ ప్రవక్తా! మేము నిన్ను సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా చేసి పంపాము''. (అన్బియా: 107) స్వయంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) వారు తన గురించి చెప్పిన మాట - ''నేను కానుకగా పంపబడిన కారుణ్యాన్ని''. (హాకిమ్) కానుకగా మనం చాలా వస్తువుల్ని పొందుతుంటాము. అయితే విశ్వ కారుణ్యమూర్తిగా అల్లాహ్‌ా మనకు ముహమ్మద్ (స) వారిని కాను కగా ఇవ్వడం ఎంత భాగ్యం, ఎంత భాగ్యం!
కారుణ్యం - మానవ నైజంలో అంతర్లీనమయి ఉన్న మౌలిక గుణం కారుణ్యం. సాటి ప్రజలపై వచ్చి పడే ఆపదలను చూచినపుడు మనలో, మదిలో కలకలం రేపేదే కారుణ్యం. సాటి వ్యక్తుల తప్పులపై బాధ పడేలా చేసేది, వారి రుజువర్తనం కోసం పరితపించేలా చేసేదే నిజమయిన కారుణ్యం, ఈ కారణంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) అన్నారు: ''కరుణించని వారిపై కరుణించడం అనేది జరుగదు''. (బుఖారీ)
ప్రేమ, కరుణ, అనురాగం, ఆప్యాయత, దయ, జాలి వంటి మానవ నైజం వాంఛించే, మానవ సమాజం కాంక్షించే సుగుణాలు మనం దరిలోనూ మొగ్గ తొడగాలి. అవి ఫలించి మరో మహా వృక్ష సృజన కు దారీ తీయాలి. కరుణను పెంచాలి, ప్రేమను పంచాలి. కరుణా ప్రదాత, మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ా మనలో సయితం ఈ గుణం వేళ్ళూనుకోవాలని కోరుతున్నాడు. ఆయన మనల్ని కరుణించా లంటే మనం ఆయన దాసుల యెడల కరుణతో, దయతో వ్యవహరిం చాలంటున్నాడు.''మీరు నేలనున్నవారిపై దయ జూపండి, నింగిన్ను వాడు మిమ్మల్ని కనికరిస్తాడు'' అని స్వయంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) అన్నారు. (అబూ దావూద్)
తప్పుల తడికెగా మారిన మనల్ని ఉద్దేశించి కరుణామయుడయిన అల్లాహ్ ఎంతో ప్రేమతో ఇస్తున్న పిలుపు - ''తమ ఆత్మలపై అన్యా యానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ా సకల పాపాలను మన్ని స్తాడు. నిస్సందేహంగా ఆయన అపార క్షమాశీలి. పరమ కృపా కరుడు''. (జుమర్:53)
నేడు భూమండలంలో - పరస్పర ప్రేమానురాగాలు, సత్ప్రవర్తన, దయాదాక్షిణ్యాలు, శ్రేయోశుభాలు, పరోపకారాలు వంటి పేర్లతో పూస్తున్నట్టుగా కానవస్తున్న పారిజాతాలన్నీ అల్లాహ్‌ా చలువ వల్లనే పూస్తున్నాయి. అదే కోవకు చెందిన పుష్పరాజం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స). అల్లాహ్ తర్వాత ఆయనంతటి కరుణ ఇంకెవ్వరికీ లేదు. ఒకరెండు సంవత్సరాలు కాదు దాదాపు 23 యేండ్లు చిత్రహిం సలు పెట్టిన వారిని ఆయన కరుణించారే గానీ కోపగించుకోలేదు. ఆయన్ను ఆయన జన్మ స్థలం నుండి వెలివేసిన వారిని దీవించారే గానీ శపించ లేదు. ఆయన ప్రాణాల్ని బలిగొనాలని పన్నాగాలు పన్నిన వారిని ప్రేమించారేగానీ, ధ్వేషించలేదు. రాత్రి సమయాన ఆయన నడిచే దారిలో కంపలు పర్చ బడ్డాయి. ఆయన సజ్దాలో ఉండగా ఆయన మెడలో త్రాడు వేసి బిగించి చంపే ప్రయత్నం జరిగింది. ఆయనపై చెత్త విసిరేయడం జరిగింంది. ఆయన్ను మూడు సంవత్స రాల పాటు సంఘం నుండి బహిష్కరించడం జరిగింది.
ఆయన్ను ఆర్థికంగా దెబ్బ తీయడం జరిగింది. ఆయన కుమార్తెలకు విడాకులిచ్చి ఆయన్ను మానసికంగా కృంగదీయడం జరిగింది. ఆయన్ను రాళ్ళతో కొట్టి రక్తసిక్తం చేయడం జరిగింది. అయన్ను పిచ్చోడని ఓసారి, మాత్రికుడని మరోసారి నింద మోపడం జరిగింది. ఆయన్ను నమ్మి నడుచుకునే వారిని నానా యాతనలకు గురి చేయడం జరిగింది. ఎంత జరిగినా, ఏమి చేసినా ఆయన కరుణను కురిపిం చారే గానీ, అందరిపై ఆధిపత్యాన్ని పొంది తర్వాత ఒక్కరిని కూడా తన స్వయం కోసం శిక్షించ లేదు. మక్కా విజయ సందర్భంలో చోటు చేసుకున్న ఈ మహా ఘట్టం మొత్తం మానవ చరిత్రలో అంతకు ముందుగానీ, ఆ తర్వాత గానీ-కనీ, వినీ, ఎరుగనిది. ఆయన అంతటి కరుణామూర్తి గనకే అన్నారు: ''కరుణ అనే గుణం నుండి ఒక్క దౌభాగ్యుడిని మాత్రమే దూరం చేయడం జరుగుతుంది''. (తిర్మిజీ)
మనం చూపే కరుణావాత్సల్యాలకు, దయాదాక్షిణ్యాలకు, ప్రేమానురా గాలకు అందరికన్నా ఎక్కువ అర్హులు-మన రక్త సంబంధీకులు. మన సమీప బంధువుల్లో అగ్రజులు మన తల్లిదండ్రులు. వారి కోసం చేయా ల్సిన ప్రార్థనను పరమ దయాళువు అయిన అల్లాహ్‌ాయే మనకు నేర్పు తున్నాడు:
''ఇలా అను: ప్రభూ! ఏ విధంగానయితే వారు నన్ను బాల్యంలో కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించారో ఆ విధంగానే వారిపై కరుణ జూపు స్వామీ!'' (బనీ ఇస్రాయీల్:23)
అంటే తల్లిదండ్రుల కరుణకు సరితూగగలిగే కరుణ విశ్వం మొత్తం లో మరొకటి లేదు గనక ప్రతిగా వారి కరుణనే పేర్కొనడం జరిగింది.
ఒకరిని బాధలో చూసి కంట తడి పెట్టడం 'జాలి గుండె' కు ప్రతీక. ప్రవక్త (స) అన్నారు: ''సలామ్‌ను సర్వవ్యాప్తం చేయండి. అన్నదానాలు చేపట్టండి. బంధువ్య సంబంధాలను బల పర్చండి. రాత్రి వేళ ప్రజలు నిద్రిస్తుండగా మీరు ప్రార్థనలు చేయండి. ఇలా గనక మీరు చేస్తే మీ ప్రభువు స్వర్గధామంలో ప్రశాంతంగా ప్రవేశించగలరు''. (ఆహ్మద్)
మనం తప్పనిసరిగా ప్రేమానురాగాలను పంచవలసిన వారిలో అనాథలు, వితంతువులు, వికలాంగులు కూడా ఉన్నారు. వారి యెడల మంచిగా మెలగటం, వారికి మేలు చేయడం, వారి పొషణా భారాన్ని సహృదయంతో స్వీకరించడం, వారి ఉజ్వల భవిష్యత్తుకై పరితపిం చడం - ఇదంతా పవిత్రమయిన ఆరాధనగా పరిగణిమచబడుతుంది. ''వితంతువుల బాగు కోసం పరిశ్రమించే వ్యక్తి విరామం లేకుండా ఉపవాసాలు ఉండేవానితో సమానం. నిర్విఘ్నంగా ప్రార్థనలు చేసేవాని తో సమానం'' అన్నారు కారుణ్యమూర్తి ముహమ్మద్ (స). (ముస్లిం)
ఓ వ్యక్తి ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి - ''నాలో హృదయ కాఠిన్యం చోటు చేసుకుంది. నాలో మచ్చుకయినా దయాదాక్షిణ్యాలు లేకుండా పోయాయి'' అని ఫిర్యాదు చేసుకున్నాడు. అది విన్న ప్రవక్త (స) - ''అనాథ తలను అప్యాయంగా నిమురు మరియు నిరుపేదకు అన్నం పెట్టు'' అని సలహా ఇచ్చి పంపారు. (ముస్నద్ అహ్మద్)
మరో సందర్భంలో ఇటువంటి ఫిర్యాదుకి నివారణోపాయంగా -''నీ మనసు మెత్త బడాలనీ, నీ జీవితం బాగవ్వాలని ఆశిస్తున్నావా? అనాథను ఆదరించు, వాత్సల్యంగా చేత్తో అతన్ని దీవించు. అతని ఆకలిని తీర్చు. అప్పుడు నీ మనసు మెత్తబడుతుంది, నీ అక్కర తీరు తుంది'' అన్నారు ప్రవక్త (స). (తబ్రానీ).
ఎందుకంటే, కరుణ, జాలి, ఆప్యాయత, అనురాగం వంటి సలక్ష ణాలు ఏ సమాజానికయినా టానిక్కు లాంటివి. మరే సమాజంలో, హృదయంలోనయితే కరుణ ఉండదో అది దేనికీ పనికిరానిదిగా తయారవుతుంది అనడంలో సందేహం లేదు. అటుంటి సమాజం నుండి, అట్టి రాతి గుండె గల వ్యక్తుల నుండి ప్రజలు పారి పోతారు ఇదే యదార్థాన్ని అల్లాహ్‌ా ఇలా తెలియజేస్తున్నాడు: ''ఇది కేవలం అల్లాహ్ కారుణ్యం కారణంగానే నువ్వు వారి యెడల మృదువుస్వభావు డవయ్యావు. నీవే గనక కర్కశుడవు, కాఠిన్య హృదయుడవు అయి ఉంటే వారందరూ నీ నుండి దూరంగా జరిగి పోయేవారు''. (ఆల్ ఇమ్రాన్:159)
మనం నివసించే సమాజంలో అందరూ ఆరోగ్యవంతులే ఉండరు. రోగగ్రస్తులు కుడా ఉంటారు. వారి యెడల దయతో మెలగాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్య ఖర్చులు భరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి చేతనయినంత సహాయం అందించాలి. ఒకవేళ ఆర్థిక సహా యం అందించే స్థితిలో మనం లేకపోయినా సహాయం చేయగలిగే దాతల వరకు వారి విషయాన్ని చేరవేయాలి. అదీ సాధ్యం కాకపోతే వారి కోసం చేతులెత్తి ప్రార్థించాలి. వీలు కుదిరితే వెళ్ళి పరామర్శించి రావడం మరీ మంచిది. ప్రవక్త (స)ఇలా అన్నారు: ''రోగగ్రస్తుని వద్దకు ఉదయం వెళ్ళి పరామర్శిస్తే-పరామర్శ జరిపిన వ్యక్తి కోసం 70 వేల మంది దైవదూతలు సాయంత్రం వరకు దుఆ చేస్తూనే ఉంటారు. ఒక వేళ సాయంత్రం వెళ్ళి పరామర్శిస్తే మరుసటి ఉదయం వరకూ 70 వేల మంది దైవదూతలు అతని బాగు కోసం ప్రార్థిస్తూనే ఉంటారు. అలాగే రొగిని పరామర్శిస్తున్నంత సేపూ పరామర్శ జరిపే వ్యక్తి స్వర్గ తాజా ఫలాలను ఏరుకుంటూ ఉంటాడు''. (అబూ దావూద్)
మనం కరుణ చూప వలసిన వారిలో కార్యాలయంలో, ఇంట్లో పని చేసే కార్మికులు కూడా ఉంటారు. వారితో వీలయినంత వరకు దయ తోనే వ్యవహరించాలి. 'నేను నా బానిసను రోజుకి ఎన్ని సార్లు కమించాలి' అన్న ప్రశ్నకు ''రోజుకి 70 సార్లు'' అన్నారు ప్రవక్త (స).
పోతే మన మనుగడలో సృష్టిలోని సమస్త ప్రాణులు తమవంతు భాగస్వామ్యాన్ని అందిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సకల చరాచరాల పట్ల దయ, కరుణ కలిగి వ్యవహరించాలి. ప్రవక్త (స) అన్నారు: ''మీరు పరస్పరం ప్రేమతో. దయతో వ్యవహరిం చండి'' అని. అందుకు అక్కడ ఉన్నవారు-'ఓ దైవప్రవక్తా! (స) మేము ఒండొకరి యెడల ప్రేమాభిమానాలతోనే వ్యవహరిస్తాము' అన్నారు. అందుకు వివరణ ఇస్తూ ప్రవక్త (స) ఇలా అన్నారు: ''నా ఉద్దేశ్యం మీరంటున్న ఈ ప్రేమ మాత్రమే కాదు, ప్రజలందరి యెడల ప్రేమ కలిగి ఉండండి. సకల ప్రాణుల యెడల సాత్విక ప్రేమ,దయా బావం తో మెలగండి''.
''ఒక స్త్రీ పిల్లిని బంధించి ఉంచిన పాపానికి నరకానికి ఆహుతి అయ్యింది. ఎందుకంటే ఆమె పిల్లిని కట్టి పడేసేది. దానికి ఆహారమూ పెట్టేది కాది, పోనీ అది ఎక్కడికయినా వెళ్ళి పొట్ట నింపుకునేందుకు దాన్ని వదిలేదీ కాదు''. (బుఖారీ హథీసు గ్రంథం)దీనికి భిన్నంగా-'ఒక పాపాత్మురాలయిన స్త్రీకి దాహంతో ఉన్న కుక్కపై జాలేసి నీళ్లు తోడి తాపించింది. ఆమె ఆ మూగ జీవం పట్ల చూపిన జాలికి అల్లాహ్‌ా ఆమె పాపాలన్నింటినీ ప్రక్షాళించేశాడు''.(ముస్లిం హథీసు గ్రంథం)
చూశారా! ఒక కుక్కపై చూపిన జాలికే ఒక పాపాత్మురాలి పాపాలన్నీ హరించుకు పోతుండగా, సాటి మానవులపై మనం చూపే కరుణ ఎన్నెన్ని మహిమల్ని సృష్టించగలదో ఊహించండి!
వెలుగుల్ని పంచుదాం! విలువల్ని పెంచుదాం!!
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ
ఖుర్ఆన్ మహా గ్రంథాన్ని పఠించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఏదోక దేశంలో, ఏదోక ఖండంలో, ఏదోక భూభాగంలో కాదు - ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నారు. వారిలో తెల్లవారూ ఉన్నారు, నల్లవారూ ఉన్నారు, అరబ్బులూ ఉన్నారు, ఆరబ్బేతరులు ఉన్నారు, ఆ విషయానికొస్తే 170 కోట్ల మంది ముస్లింలలో 25 శాతం మంది అరబ్బు ముస్లింలయితే 75 శాతం మంది అరబ్బేతరులే. ఒక్క మాటలో చెప్పాలంటే ఖుర్ఆన్ చదవకుండా ప్రపంచంలో ఒక్క క్షణం కూడా గడవదు. ఏదోక చోట, ఏదోక రూపంలో అనునిత్యం ఖుర్ఆన్ పఠనం సాగుతూనే ఉంటుంది. ఖుర్ఆన్ ఆవతరించి 1435 సంవత్సరాలకు పై చిలుకు ఆవుతున్నా నాటి నుండి నేటి వరకు అది భిన్న జాతుల్ని, భిన్న సంస్కృతుల్ని, భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రళయం వరకూ చేస్తూనే ఉంటుంది.
దాన విధానాన్ని తీసుకొచ్చి అనేక ప్రతిపాదనల్ని ప్రవక్త (స) వారి ముందు పెట్టి ధర్మ కార్యాన్ని మానుకోవాల్సిందిగా కోరిన ఉత్భా ముందు ఖుర్ఆన్ సూక్తులు చదివి విన్పించడం జరిగింది. సాంతం ప్రశాంతంగా విన్న ఉత్బా తన తెగ వారి వద్దకు వెళ్ళి ఇలా అభిప్రాయ పడ్డాడు: 'సాహితీ పరంగా నాకన్నా బాగా తెలిసిన వాడు మీలో ఎవరూ లేరు. పద్యాన్ని, గద్యాన్ని, భాషా నుడికారాల్ని నేను ఎరిగినం తగా ఎవరు ఎరిగి లేరు అన్నదీ స్పష్టమే. నేను ముహమ్మద్ (స) నుండి విన్నది మనిషి అన్న మాట కానే కాదు. మనిషి అలాంటి వచనాల్ని చెప్పలేడు కూడా.''దైవసాక్షి! ఆ వాణిలో మధురామృతం జాలువారుతూ ఉంది. అందులో ఏదో తెలియని ఆకర్షణా శక్తి ఉందనిపిస్తుంది. దాని పై భాగం ఫలవంతం అయితే, దాని క్రింది భాగం శాంతిభరితంగా గోచరిస్తుంది. అది విజయానికి చిరునామా. దానిపై విజయం ఎవరి వల్ల సాధ్య పడని అంశం''.
ఇది నిజం, కఠోర సత్యం! - ''ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్య ధర్మాన్ని ఇచ్చి పంపాడు-దాన్ని మతధర్మాలన్నింటిపై ఆధిక్యం వహిం చేలా చేయడానికి. ఈ విషయం బహుదైవారాధకులకు ఎంత సహించ రానిదయినా సరే''. (అస్సఫ్:9)
సేల్స్ టాక్స్ డిప్యూటి కమిష్నర్ దగ్గర పని చేసే ఓ ముస్లిం చఫ్రాసీ ఆయన ద్వారా ప్రమోషన్ అందుకున్న సంతోషంలో ఆయనకో గిప్టు ఇవ్వాలనుకున్నాడు. తానేమో పేదవాడు, ఏం గిప్టు ఇస్తే బాగుంటుంది అని తర్జన భర్జన పడ్డాడు. చివరికి ఆయన దగ్గరకు వెళ్ళి- ''సర్, నేను మీకు ఇవ్వబోతున్న గిఫ్ట్‌కు సరితూగ గలిగే వస్తువేది విశ్వం మొత్తంలో లేదు'' అంటూ ఓ గిప్టు ప్యాకు అందించాడు. ఆఁ అంత పెద్ద గిప్టు ఇతను నాకేమివ్వగలడు అనుకొని తీసుకెళ్ళి అల్మారాలో పెట్టి మరచి పోయాడు ఆ అధికారి. కాని పడకపై మేను వాల్చగానే ఛప్రాసీ మాటలు గుర్తుకొచ్చాయి. మరచి నిద్ర పోదామనుకుంటే నిద్ర పట్టడం లేదు. అలానే మూడో వంతు రాత్రి గడిచి పోయింది. రాత్రి చివరి ఝామున లేచి ఆ గిప్ట ప్యాక్ తెరచాడు. అది హిందీ భాషలో ఉన్న ఖుర్ఆన్. ఏం రాయబడి ఉందో చదువుదాం అని తెవరబోయి ఆగి పోయాడు. పైన కవరుపై హిందిలో వ్రాయబడి ఉంది 'పరిశుద్ధులే దాన్ని ముట్టుకుంటారు' అని. వెళ్ళి స్నానం చేసి వచ్చి చదవనారంభిం చాడు. ఆ రోజు మొదలయి ఆయన ఖుర్ఆన్ గ్రంథ పారాయణం చాలా రోజుల వరకు సాగింది. చివరికి ఇస్లాం స్వీకరించాడు. అప్పుడర్థ మయ్యింది-గిఫ్టు ఇస్తూ ఛప్రాసీ చెప్పి మాట ఎంత వాస్తవమో. అతను ఆ గిఫ్టు తనకిచ్చి ఉండకపోతే తాను ఎంతటి మహా భాగ్యాన్ని కోల్పో యేవాడో!
అల్హమ్దులిల్లాహ్ మనం దివ్యఖుర్ఆన్ పారాయణం చేస్తున్నాము, స్వయంగా పారాయణం చేయడమే కాక సుస్వరకర్తల స్వరంలో ఖురాన్ స్వర్ణకార ధ్వనిని వింటున్నాము. అయితే అన్నీ ఉపద్రవాల నుండి మాన వాళిని కాపాడే ఉద్గ్రంథంగా మనం విశ్వసిస్తున్న ఈ గ్రంథరాజాన్ని ఇతరుల వరకు చేరవేసే ప్రయత్నం చేశామా? మనం అందజేసే ఈ గిఫ్టు ఎందరి జీవితాల్ని మార్చగలదో ఎప్పుడయినా ఆలోచించామా? ఏ విషయంలో ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం -
ఆలస్యం అమృతం విషం!
Wednesday, November 19, 2014
Subscribe to:
Comments (Atom)



