Wednesday, November 19, 2014
Wednesday, August 27, 2014
Sunday, August 24, 2014
ఉమ్రా విధానం
ఉమ్రాని నెరవేర్చాలన్న సంకల్పంతో మస్జిదె హరామ్ చేరుకున్నప్పుడు కుడి కాలు పెడుతూ ఈ దుఆ పఠిస్తూ మస్జిదె హరామ్‌లో ప్రవేశించాలి.
”బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మగ్‌ఫిర్‌లీ జునూబీ వఫ్‌తహ్‌లీ అబ్‌వాబ రహ్మతిక్.”
”అవూజు బిల్లాహిల్ అజీమ్ వ బివజ్‌హిహిల్ కరీమ్ వ బిసుల్తానిహిల్ ఖదీమ్ మినష్షైతానిర్రజీమ్”.
తవాఫ్: కాబాపై దృష్టి పడగానే చేసే దుఆ స్వీకరించబడుతుందని గుర్తుంచుకోండి. తరువాత తవాఫ్ (ప్రదక్షిణ) మొదలు పెట్టడానికి హజ్రె అస్వద్ వైపు సాగి పోవాలి. వీలైతే దాన్ని ముద్దాడాలి. దాన్ని ముద్దాడే ప్రయత్నంలో ఇతర యాత్రికులను తోసి వేయకూడదు. హజ్రె అస్వద్‌ని తాకేటప్పుడు ఈ దుఆ పఠించాలి:
”బిస్మిల్లాహి అల్లాహు అక్బర్.అల్లాహుమ్మ ఈమానన్ బిక, వ తస్‌దీఖన్ బికితాబిక, వ వఫాఅన్ బి అహ్‌ాదిక, వ ఇత్తిబాఅన్ లిసున్నతి నబియ్యిక (స)”. ప్రతి ప్రదక్షిణ హజ్రె అస్వద్ నుండి ప్రారంభమై హజ్రె అస్వద్ దగ్గరే ముగుస్తుంది. రుక్నె యమానీని వీలైతే చేత్తో తాకాలి. లేదంటే సైగ చెయ్యకూడదు. ముద్దాడకూడదు. రుక్నె యామని – హజ్రె అస్వద్‌ల మధ్య ఈ దుఆ పఠించాలి: ”రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్ వ ఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్”.
తవాఫ్ కోసం పరిశుద్ధత (తహారత్) మరియు వుజూ అవసరం. అలాగే ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు కాబా మీకు ఎడమ వైపు ఉండాలి. మొదటి ప్రదక్షిణలో భుజాలపైనున్న ఇహ్రాం గుడ్డ నుండి కుడి భుజాన్ని తెరచి వుంచటం మంచిది. అలాగే మొదటి మూడు ప్రదక్షిణల్లో జోరుగా నడవడం అభిలషణీయం. ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసిన పిదప, మఖామె ఇబ్రాహీం దగ్గర 2 రకాతుల నమాజ్ వీలైతే చెయ్యాలి. అలా కుదరని ఎడల మస్‌జిదె హరామ్‌లో ఎక్కడ చోటు లభిస్తే అక్కడ చేసుకోవాలి.
మొదటి రకాతులో ”ఫాతిహా సూరా” తరువాత ”ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” రెండవ రకాతులో ”ఖుల్ హువల్లాహు అహద్” పారాయణం చెయ్యాలి.
తరువాత జమ్‌జమ్ జలం త్రాగడం అభిలషణీయం. మళ్ళీ అక్కడి నుండి బయలు దేరి సఫా కొండ వద్దకు చేరుకోవాలి.
సయీ: ఇప్పుడు మీరు సఫా కొండను సమీపించారు. ఇప్పుడు ”ఇన్నస్సఫా వల్ మర్‌వత మిన్ షఆయిరిల్లాహ్‌ా….(బఖరా) ” అనే ఆయత్ పఠించాలి. తరువాత మెల్లగా కొండపై చేరుకోవాలి. కాబా వైపుకి తిరిగి ప్రవక్త (స) చదివిన ఈ దుఆని చదవాలి:
”లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ, లా షరీక లహూ, లహుల్‌ముల్కు, వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ, అన్‌జజ వఅదహూ, వ నసర అబ్దహూ, వ హజమల్ అహ్‌ాజాబ వహ్‌దహూ”.
పై దుఆ మూడ సార్లు చదివిన తరువాత ఇష్టమైన దుఆ చెయ్యాలి. ఆ తరువాత సఫా నుండి సయీని ప్రారంభించి మర్వా వరకు, మర్వా నుండి సఫా వరకు 7 సార్లు సయీ చెయ్యాలి. పచ్చటి గుర్తు మధ్య పురుషులు మాత్రం వేగంగా నడవాలి. ఆ తరువాత బయటకెళ్ళి శిరోముండనం చేయించుకోవాలి. లేదా వెంట్రుకలను కత్తిరిం చుకోవాలి. స్త్రీలు శిరోముండనం చెయ్యకూడదు. వారు కొన్ని వెంట్రుకలు మాత్రమే కత్తిరిస్తే సరిపోతుంది. ఈ విధంగా మీ ఉమ్రా పూర్తయింది.
ఇప్పుడు మీరు ఇహ్రామ్ ఆంక్షల నుంచి ముక్తి పొందారు. ఇహ్రామ్ సందర్భాన నిషిద్ధమై ఉన్న ధర్మసమ్మతమైన కొన్ని కార్యాలు హలాల్ అవుతాయి.
గమనిక: ఇది హజ్జె తమత్తుకి సంబంధించిన ఉమ్రా మరియు సంవత్సరంలో ఎప్పుడైనా చేసే ఉమ్రా విధానం. ఇక హజ్జె ఖిరాన్‌కి సంబంధించిన ఉమ్రా గురించి తెలుసుకుందాం. మీరు హజ్జె ఖిరాన్ చేసినట్లయితే మక్కా వెళ్ళగానే కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసిన తరువాత రెండు రకాతులు నమాజ్ చేసి, సఫా మర్వాల మధ్య సయీ చెయ్యాలి. కాని హజ్ పూర్తి అయ్యే వరకు శిరోముండనం చెయ్యకూడదు. హజ్జె ఇఫ్రాద్ అయితే తవాఫె ఖుదూమ్ తరువాత హజ్ సయీ చెయ్యవచ్చు. లేదా తవాఫె ఇఫాజ అనంతరం సయీ చేయవచ్చు. అంటే తవాఫే ఖుదూమ్ తరువాత హజ్ పూర్తయ్యేవరకూ ఇహ్రాంలోనే ఉంటారు.
హజ్ విధానం
1) హజ్ క్రియలు: జుల్‌హిజ్జ 8 వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఈ రోజుని యౌముత్-తర్‌వియా అని కూడా అంటారు. ఈ రోజు హాజీలు స్నానం చేసి హజ్ దీక్ష బూనాలి. జుహర్ నమాజుకు ముందు మినా మైదానానికి బయలు దేరి వెళ్ళాలి. అక్కడ జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజులు విడివిడిగా వాటి సమయాలలో ఖసర్ చేసి చదవాలి. మినా మైదానంలో 9వ తేదీ రాత్రి గడిపి, ఫజ్ర్ నమాజ్ మినా మైదానంలోనే చేసి, సూర్యోదయం తరువాత అరఫాత్ మైదానం వైపు బయలు దేరాలి. మినా మైదానంలో రాత్రి బస చెయ్యడం ప్రవక్త (స) సంప్రదాయం.
2) అరఫాత్‌లో విడిది: అరఫాత్‌లో ‘నమిర’ అనే స్థలంలో దిగటం మంచిది. అలా కుదరకపోతే అరఫా మైదానంలో ఎక్కడైనా దిగవచ్చు. అరఫాలో ప్రవక్త (స) సంప్రదా యాన్ని అనుసరిస్తూ జుహ్ర్– -అస్ర్ నమాజులు ఒక అజాన్ రెండు ఇఖామత్‌లతో కలిపి ఖసర్ (రెండేసి రకాతుల చొప్పున) చేసి చదవాలి. నమాజ్ తరువాత అల్లాహ్ నామ స్మరణలో, అల్లాహ్‌ను వేడుకోవడంలో నిమగ్నమైపోవాలి. ప్రవక్త (స) ఈ రోజు ప్రత్యే కంగా ఈ దుఆ పఠించేవారు:
”లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ లా షరీక లాహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్”.
ఇలా దుఆ చేస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ సూర్యాస్తమయం వరకు అరఫాలో వేచి ఉండాలి. సూర్యాస్తమయానికి ముందు బయలుదేరకూడదు. ఒకవేళ బయలు దేరినా తిరిగి మరలా అరఫా మైదానంలో చేరుకోవాలి. అలా తిరిగి రాని ఎడల అతని పై పరిహారం తప్పనిసరి అవుతుంది. అలాగే ఎవరైనా 9వ తేది అంటే అరఫా రోజున సూర్యాస్తమయానికి ముందే అరఫాత్ మైదానంలోకి ప్రవేశించకపోతే వారి హజ్ నెరవేరదు. వారు వచ్చే ఏడాది దాన్ని పూర్తి చెయ్యాలి.
3) ముజ్‌దలిఫా: హాజీ, ముజ్‌దలిఫా చేరుకోగానే ఒక అజాన్ రెండు ఇఖామత్‌లతో మగ్రిబ్ నమాజు పూర్తిగా ఇషా నమాజును ఖసర్ చేసి చదవాలి. తరువాత ముజ్‌దలిఫాలో రాత్రి బస చేయాలి. అర్థరాత్రి గడచిన పిదప బలహీనులైన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వారి సేవ చేసేవారు ‘మినా’ వైపు వెళ్ళవచ్చు. కాని బలవంతులు మాత్రం రాత్రంగా అక్కడే గడిపి ఫజ్ర్ నమాజ్ చేసిన పిదప బాగా తెల్లారే వరకు దుఆ చేస్తూ ఉండాలి.
4) సూర్యోదయానికి ముందు మినా వైపు పయనించాలి. అర్ధరాత్రికి ముందు బలహీ నులైనా, బలవంతులైనా బయలు దేరకూడదు. ఎందుకంటే ముజ్‌దలిఫాలో రాత్రి గడపడం తప్పనిసరి.
5) పండగ రోజున అంటే జుల్ హిజ్జ 10వ తేదీన జరగవలసిన హజ్ క్రియలు:
అ) రమీ-కంకర్రాళ్ళు రువ్వడం. ఆ) హదీ- ఖుర్బానీ.
ఇ) హల్ఖ్-శిరోముండనం. ఈ) తవాఫ్, సయీ.
అ) రమీ: హాజీ ముజ్‌దలిఫా నుండి బయలుదేరి మినా వచ్చేటప్పుడు ముజ్‌దలిఫా నుండి లేదా దారిలో ఎక్కడనుండైనా చిన్న చిన్న 7 కంకర్రాళ్ళు తీసుకోవాలి. జమ్ర తుల్ ఉఖ్బా దగ్గరకు వెళ్ళి అక్కడ వున్న స్థంభానికి తగిలేటట్టు కంకర్రాళ్ళని విసరాలి. రమీ సమయం చంద్రమానం జిల్‌హిజ్జా 10వ తేదీ అర్థ రాత్రి నుండి మొదలై 10వ తేదీ సూర్యాస్తమయం వరకు ఉంటుంది. బలవంతులు సూర్యోదయం తరువాత రమీ చెయ్యటం ఉత్తమం.
ఆ) హదీ: ఖుర్బానీ పశువును తెచ్చుకున్న వారు జిబహ్ చెయ్యాలి. జిబహ్ సమయం 10వ తేది సూర్యుడు ఉదయించినప్పటి నుండి 13వ తేది సూర్యాస్తమయం వరకు ఉంటుంది. అంటే పండుగ రోజు తరువాత మరో మూడు రోజులన్న మాట. హదీని స్వయంగా భుజించవచ్చు. ఇతరులకు బహుమానంగా ఇవ్వ వచ్చు. పేదలకూ పంచి పెట్ట వచ్చు. ముఫ్రిద్ (హజ్జె ఇఫ్రాద్ చేసే వ్యక్తి)కి ఖుర్బానీ లేదు. ఖిరాన్, తమత్తు హజ్ చేసే వారికే హదీ ఉంది.
ఇ) హలఖ్ – (శిరోముండనం లేదా జుత్తు కత్తిరించటం): ఖుర్బానీ తరువాత తల వెంట్రుకలను పూర్తిగా తీసి వెయ్యాలి. లేదా కత్తిరించాలి. స్త్రీలు మాత్రం కొన్ని శిరోజాలను కత్తిరిస్తే సరి పోతుంది. పండుగ రోజున హాజి, రమీ-హల్ఖ్ రెండూ పూర్తి చేశాక అతనికి – స్త్రీలు తప్ప ఇహ్రాం సందర్భాన ఉన్న నిషేధాలన్నీ తొలిగి పోతాయి. అంటే తన భార్యతో రమించకూడదు. ఆమె వైపు కామంతో నిండిన చూపు తవాఫే ఇఫాజ చేసేంత వరకూ చూడకూడదు.
ఈ) తవాఫ్-సయీ: అంటే హల్ఖ్ తరువాత మస్‌జిదే హరామ్ వైపు వీలైతే ఆ రోజే వెళ్ళాలి. వెళ్ళి తవాఫే ఇఫాజ చేయాలి. ముతమత్తి లేదా ముఖ్రిన్ అయితే సయీ కూడా చెయ్యాలి. ముఫ్రిద్ మాత్రం తవాఫే ఖుదూమ్ తరువాత సయీ చెయ్యని ఎడల ఇప్పుడు చెయ్యాలి. తవాఫ్ అన్నది ఈ రోజు అంటే 10వ తేది చెయ్యటం చాలా మంచిది. దీన్నే 13వ తేదీ వరకు ఆలస్యం కూడా చెయ్యవచ్చు. కాని అంతకు మించి ఆలస్యం చేయకూడదు.
10వ తేది చేసే పనులు ఒక చూపులో: 1) రమీ 2) జిబహ్‌ా 3) హల్ఖ్-తఖ్‌సీర్ 4) తవాఫె ఇఫాజ 5) సయీ.
గమనిక: వీటిలో ఏది ముంది ఏది వెనుకా అయినా పరవాలేదు. ఒక వేళ హదీ జంతువు లభించకపోతే అరఫా రోజు, పండుగ రోజు తప్ప హజ్‌లో మూడు రోజులు ఉపవాసం ఉండాలి. ఇంటికెళ్ళిన పిదప 7 ఉపవాసాలుండాలి. అంటే దీనికి పరిహారం 10 రోజుల ఉపవాసాలన్న మాట.
ఉ) అయ్యామే తష్రీఖ్ (తష్రీఖ్ రోజులు): జుల్‌హిజ్జ 11, 12, 13 తేదీలని అయ్యామె తష్రీఖ్ అంటారు. ఈ మూడు రోజులు హాజీలు రాత్రి ఎక్కువ సమయం మినాలో గడపాలి. ఇది వాజిబ్ (తప్పనిసరి). ఈ మూడు రోజుల్లో సూర్యుడు కాస్త పైకి ఎగ బ్రాకిన తరువాత రమీ చెయ్యాలి. 4 రకాతుల నమాజులని ఖస్ర్ చేసి విడివిడిగా ఆయా సమయాల్లోనే చదవాలి.
ఊ) రమీ విధానం: జవాల్ తరువాత ఎక్కడ నుండి అయినా సరే 21 కంకర రాళ్ళు తీసుకోవాలి. తరువాత జమ్రతుస్ సుగ్రా (చిన్న స్థంభం)ను సమీపించి 7 కంకరర్రాళ్ళ ను ఒక్కొక్కటిగా ‘అల్లాహు అక్బర్’ అంటూ ఎదుట వున్న స్థంభానికి తగిలేటట్లు విసరాలి. తరువాత కాబా వైపు ముఖం త్రిప్పి దుఆ చెయ్యాలి. తరువాత జమ్రతుల్ ఉస్తా దగ్గరకు రావాలి. ఇక్కడ కూడా 7 కంకరర్రాళ్ళను మొదట విసిరించినట్లే విస రాలి. తరువాత అక్కడా దుఆ చెయ్యాలి. ఆ తరువాత జమ్రతుల్ ఉఖ్బా దగ్గరకు వచ్చి అక్కడ కూడా 7 కంకర రాళ్ళు అల్లాహు అక్బర్ అంటూ రువ్వాలి. తరువాత దుఆ చెయ్యకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలి. 12 వ తేదీన కూడా అలాగే చెయ్యాలి. తరువాత వెళ్ళ దలచుకుంటే 12వ తేదీ సూర్యాస్తమయానకి ముందు బయలుదేరి పోవాలి. సూర్యుడు అస్తమించాడనుకోండి మళ్ళీ 13 తేది కూడా రమీ తప్పకుండా చెయ్యాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఆలస్యం చెయ్యడం తొందరగా వెళ్ళడంకన్నా మంచిది.
గమనిక: రమీ చెయ్యలేని స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తమ తరపున మరొకరికి ఆ బాధ్యత ను అప్పగించవచ్చు. ఎ) తవాఫుల్ విదా: హాజీ, మక్కా వదలి వెళ్ళే సంకల్పం చేసుకుంటే వీడ్కోలు ప్రదక్షిణ (తవాఫ్ విదా) చెయ్యకుండా వెళ్ళకూడదు. బహిష్టు స్త్రీకి తవాఫె విదా లేదు. (మరి ఎవరైతే తవాఫె ఇఫాజాని అలస్యం చేస్తాడో అతనికి తవాఫె విదాకి బదులు తవాఫె ఇఫాజ సరిపోతుంది).
ఫిదియా (పరిహారం)
అ) ఇహ్రామ్ నియమాలకు ఖచ్చితంగా కట్టుబడలేకపోయిన వ్యక్తి పరిహారంగా 3 రోజులు ఉపవాసాన్ని పాటించాలి. లేదా 6 మంది పేదలకి అన్నం పెట్టాలి లేక ఖుర్బానీ ఇవ్వాలి.
ఆ) ఉపవాసాలు ఎక్కడైనా ఉండవచ్చు. హరమ్‌లోనే ఉండాలన్న నిబంధన లేదు.
ఇ) హరమ్‌లో నివసించే పేదలకు అన్నం పెట్టడం మంచిది. హరమ్ బైట ఉన్న వారికి కూడా పెట్టవచ్చు.
ఈ) ఖుర్బానీ పశువుని హరమ్‌లో జిబహ్‌ా చెయ్యడం ఉత్తమం. పరిహారంగా జిబహ్‌ా చేసే జంతువు మాంసం స్వయంగా హాజీ తినకూడదు. ధనవంతులకు పెట్టకూడదు. ఇది కేవలం నిరుపేదల హక్కు.
ఉ) జుల్‌హిజ్జ 10వ తేదీ జమ్రతుల్ ఉఖ్బాలో రమీ మరియు శిరోముండనానికి ముందు ఎవరైనా తన భార్యతో రమిస్తే – 1) వారి హజ్ భంగమవుతుంది. 2) పరిహారంగా ఒక ఒంటెని లేదా ఆవుని జిబహ్‌ా చెయ్యాల్సి ఉంటుంది. 3) భంగమైన హజ్‌ని పూర్తి చెయ్యాలి. 4) వచ్చే సంవత్సరం ఈ హజ్‌కి బదులు మరలా హజ్ చెయ్యాలి. 5) అదే జమ్రతుల్ ఉఖ్బా రమీ మరియు హల్ఖ్ (శిరోముండనం)ల తరువాత తవాఫె ఇఫాజ (జియార)కి ముందు తన భార్యతో సంభోగిస్తే హజ్ భంగం కాదు. కాకపోతే ఒక మేకను పరిహారంగా జిబహ్‌ా చేయాల్సి ఉంటుంది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ‘ముహ్రిం నికాహ్ చెయ్యకూడదు. నికాహ్‌ా సందేశం పంపకూడదు’. (ముస్లిం – అహ్మద్)
హజ్-ఉమ్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పారభాషిక పదాలు
ఇహ్రాం: ఉమ్రా లేక హజ్ లేదా రెండింటి కోసం ఒకేసారి దీక్ష బూనటం.
ఇహ్రాం దుస్తులు: దీక్ష సందర్భంగా ధరించే రెండు తెల్లటి దుప్పట్లు.
ముహ్రిం: మీఖాత్ చేరుకున్న పిదప హజ్ – లేదా ఉమ్రాకరొకు దీక్ష బూనిన వ్యక్తిని ముహ్రింగా వ్యవహరిస్తారు.
హరమీ: స్వదేశి అయినా, పరదేశి అయినా హరంలో నివసించే వ్యక్తి.
హజ్ మాసాలు: 1) షవ్వాల్ 2) జుల్ ఖఅదా 3) జుల్‌హిజ్జ మాసపు మొదటి పది రోజులు.
ఇస్తిలామ్: హజ్రె అస్వద్ (నల్లరాయి)ని ముద్దాడటం లేదా చెయ్యితో తాకటం, దూరం నుండి సైగ చెయ్యటం.
ఇజ్‌తిబా: ఇహ్రాం దుప్పటిని కుడి భుజం క్రింద నుండి తీసి ఎడమ భుజంపై వేసుకో వటం, అంటే కుడి భుజం తెరచివుంటే, ఎడమ భుజం కప్పబడి ఉండాలి.
తష్రీఖ్ దినాలు: జుల్‌హిజ్జ 11, 12, 13 తేదీలు.
తల్‌బియా: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్………
తమత్తు: హజ్ నెలల్లో ఉమ్రా కొరకు ఇహ్రాం ధరించి, ఉమ్రా చేసి అదే సంవత్సరం అదే ప్రయాణంలో హజ్ ఇహ్రాం కూడా బూని హజ్ చెయ్యటం.
ముతమత్తి: హజ్జె తమత్తుకై దీక్ష బూనిన వ్యక్తి.
ఖిరాన్: మీఖాత్ చేరిన పిదప ఉమ్రా-హజ్‌ల దీక్ష ఒకేసారి బూనటం. అంటే ఉమ్రా చేసిన తరువాత అవే దుస్తుల మీద హజ్ నియమాలను నెరవేర్చటం.
ఖారిన్- ముఖ్రిన్: హజ్జె ఖిరాన్ దీక్ష బూనిన వ్యక్తి.
ఇఫ్రాద్: కేవలం హజ్ దీక్ష బూనటం. ఈ హజ్ చేసే వ్యక్తిని ముఫ్రిద్ అంటారు.
మీఖాత్: హజ్-ఉమ్రాల కోసం మక్కా వెళ్ళే వారు ఏ స్థలానికి చేరాక దీక్ష బూనటం తప్పని సరో దాన్ని మిఖాత్ అంటారు.
సున్నత్: హజ్-ఉమ్రాలో ప్రవక్త (స) చేసిన పనులు. వీటిని పాటించడం పుణ్యప్రదం. వీటిని వదలడం అవాంఛనీయం.
తహ్లీఖ్- హల్ఖ్: ఉమ్రాలో తవాఫ్ మరియు సయీ తరువాత, హజ్‌లో ఖుర్బాని తరు వాత తలవెంట్రుకలను పూర్తిగా తీసివేయటం.
తఖ్సీర్: శిరోముండనానికి బదులు తలవెంట్రుకలను కత్తిరించటం.
దమ్: చెయ్యరాని పని చేసినందుకు ఖుర్బాని తప్పనిసరి అవటం.
రమీ: మూడు జమరాత్‌ల దగ్గర కంకర రాళ్ళు రువ్వటం.
రమల్: తవాఫ్ చేసేటప్పుడు మొదటి మూడు ప్రదక్షిణల్లో కాళ్ళు దగ్గరగా పెడుతూ భుజాలను ఎగురవేస్తూ జోరుగా నడవటం.
షౌత్: కాబా గృహ ఒక ప్రదక్షిణని హతీమ్‌తో కలిపి షౌత్ అంటారు.
తవాఫె ఖుదూమ్: మక్కా చేరుకున్న తరువాత చేసే మొదటి తవాఫ్. దీనినే తవాఫె ఉరూద్ మరియు తవాఫె తహియ్యా అని కూడా అంటారు.
తవాఫె ఇఫాజా: జుల్‌హిజ్జ 10వ తేదీన చేసే ప్రదక్షిణ. దీన్ని తవాఫె జియారహ్ మరియు తవాఫె రుకున్ అని కూడా అంటారు. సమయం 10వ తేదీ రమీ, ఖుర్బాని, హల్ఖ్‌ల తరువాత.
తవాఫె విదా: హరమ్ బయట నుండి వచ్చే హాజీలు మక్కా నుండి బయలుదేరక ముందు చేసే ప్రదక్షిణ. దీన్ని తవాఫె సద్ర్ అని కూడా అంటారు.
ఫిద్యా – (పరిహారం): చెయ్యరాని పని ఏదైనా చేస్తే ఫిదియా తప్పనిసరి. 3 రోజుల ఉపవాసాలుండాలి లేదా ఆరుగురు నిరుపేదలకు అన్నం పెట్టాలి. లేదా మేకను జిబహ్‌ా చేసి పేదవారిలో పంచిపెట్టాలి.
సయీ: సఫా – మర్వా కొండల మధ్య ఏడుసార్లు తిరగటం (పచ్చని లైట్లు గల స్థలంలో చిన్నగా పరుగెత్తటం)
పవిత్ర మక్కా ప్రాశస్య్తం
1) ఈ స్థలంలోనే అల్లాహ్ ఆరాధనకై ప్రజలందరికోసం మొట్ట మొదటి దైవ గృహం నిర్మించబడింది. ప్రవక్త ఇబ్రాహీం (అ) ఇస్మాయీల్ (అ) లు తమ భుజాలపై ఈ ఇంటి రాళ్ళని మోసారు.
2) ఈ స్థలంలోనే దుష్టుడు అబ్రహ, అతని సైన్యం నాశనం చెయ్యబడింది.
3) ఈ స్థలంలోనే చరిత్రలో అతి పెద్ద సంఘటన జరిగింది. ప్రవక్త (స)పై వహీ ద్వారా దైవధర్మం పరిపూర్ణం చెయ్యబడింది.
4) ఈ స్థలం నుంచే ప్రవక్త (స)వారిని గగన యాత్రకి తీసుకెళ్ళడం జరిగింది. ఆకాశ వాసులు-భూవాసులతో, దూతలు-మానవులతో కలిసారు.
5) ఈ స్థలంలోనే జమ్‌జమ్ జలం పెల్లుబికింది. శతాబ్దాల తరబడి ప్రపంచమంతటికీ సరఫరా అవుతోంది.
6) ఈ స్థలంలోనే సత్యప్రియుడు, సత్యసంధుడు, సద్గుణ సంపన్నుడు, శుభకరుడు, సర్వలోక కారుణ్యమూర్తి అయిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) జన్మించారు.
7) ఈ స్థలంలోనే విశ్వాసులకు అతిపెద్ద విజయం లభించింది. చిల్లర దైవాలుగా పూజింపబడే శిలలను పగలగొట్టడం జరిగింది. అసత్యంపై సత్యం విజయ కేతనాన్ని ఎగుర వేసింది. హజ్రత్ బిలాల్ (ర) లాంటి నల్లని నిగ్రో కాబా గృహంపైకెక్కి అజాన్ ఇచ్చారు.
మక్కా మర్యాద: ఈ నగరం శాంతి నిలయం, మార్గదర్శక కేంద్రం. ఇందులో ప్రవే శించక ముందు స్నానం చెయ్యటం ప్రవక్త (స) సదాచారం. ఈ నగరంలో మంచి కార్యాల ప్రతిఫలం చాలా ఎక్కువ. అలాగే పాపాల శిక్ష కూడా చాలా కఠినమైనదే. కనుక ఇక్కడ ఉన్నన్ని రోజులు పుణ్యకార్యాలే చెయ్యాలి. పాపాలకి ఒడిగట్ట కూడదు. ఈ నగరాన్ని హరమ్ అని కూడా అంటారు. కనుక హరమ్ సరిహద్దుల్లో ఇహ్రాం ధరించిన వారైనా, ధరించని వారైనా వేటాడటం నిషిద్ధం. ఒకవేళ వేటాడి జిబహ్ చేసినా అది హలాల్ అవ్వదు. హరమ్ పరిసరాల్లో గల చెట్లను, గడ్డిని అనవసరంగా పెరక కూడదు. క్రింద పడి ఉన్న వస్తువుని మంచి ఉద్దేశ్యంతో తప్ప ముట్టుకోకూడదు.
కాబా పరదా
కాబాపై పరదా వేసిన మొట్టమొదటి వ్యక్తి హజ్రత్ ఇస్మాయీల్ (అ). పూర్వం ముహర్రం 10వ తేదీన పరదా మార్చేవారు. మళ్ళీ ఖుర్భానీ చేసేరోజు మార్చనా రంభించారు. మళ్ళి జుల్‌ఖఅదలో మార్చేవారు. ప్రస్తుతం అరఫా రోజున మారుస్తు న్నారు. పూర్వం పరదా కాబా అర్ధ భాగానికే ఉండేది.
మొదట తెల్లని సిల్కు పరదాని కప్పిన వారు మామూన్ రషీద్. పసుపు సిల్కు పరదాని కప్పినవాడు ముహమ్మద్ బిన్ సబక్తకీన్. పచ్చని సిల్కు పరదాని కప్పినవాడు నాసిరుల్ అబ్బాసి. తరువాత నల్లని పరదా కప్పడం ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే రంగు పరదాను తొడిగిస్తున్నారు.
ఇస్లాం సంపూర్ణమైన తరువాత ఈ పరదా ఈజిప్టులో తయారయ్యేది. ఇప్పుడు నల్ల రంగు పూసిన స్వచ్ఛమైన పట్టుతో తయారు చేయబడుతోంది. ఈ పరదాపై బంగారు తీగలతో ఖుర్‌ఆన్ ఆయతులు లిఖించ బడ్డాయి. ఈ పరదా ఎత్తు 14 మీటర్లు చుట్టు కొలత 47 మీటర్లు. 3 మీటర్ల క్రింద 95 సె.మి వెడల్పు గల పట్టిపై ఖుర్‌ఆన్ ఆయ తులు లిఖించ బడ్డాయి. కాబా తలుపులపై ఉన్న పరదా ఎత్తు 71/2 మీటర్లు. వెడల్పు 4 మీటర్లు దానిపై ఖుర్‌ఆన్ ఆయతులు బంగారు తీగలతో లిఖించబడ్డాయి. ఈ పరదా తయారు చెయ్యటానికి అయ్యే ఖర్చు 170 లక్షల సవూది రియాళ్ళు. అంటే భారత కరెన్సీలో సుమారు 22 కోట్లన్నమాట. ఈ పరదా తయారిలో సంవత్సరంపాటు 240 మంది కార్మికులు పని చేస్తారు. ఈ పరదా కోసం ప్రత్యేకంగా కిస్వతుల్ కాబా పేరుతో ఓ కంపెనీ మక్కాలోనే ఉంది. ఈ పరదా కొరకు ఉపయోగించే పట్టు 670 కిలోలు. ఈ పరదాలో ఉపయోగించే వెండి – బంగారు 120 కిలోలు.
హజ్ అంటే…
హజ్: ఇంటిని వదలడం, బంధుమిత్రులకు దూరమవడం, కృపాకరుడి దరికి చేరడం, మృత్యువును గుర్తు చేసుకోవడం, అనుగ్రహాలు వర్షంలా కురిసే శుభప్రదమైన ఇంటి వైపునకు పయనించడం.
హజ్: అక్కడికి షైతాన్ కూడా వస్తాడు. అతని సైన్యమూ ఉంటుంది. హద్దులు మీరే వారూ ఉంటారు. ప్రజలందరూ కలుస్తారు. ప్రతిజ్ఞ మళ్ళీ ధృవ పరచడం జరుగుతుంది ప్రతిజ్ఞకు సాక్ష్యమూ తీసుకోబడుతుంది.
ఇహ్రాం: అలంకరణను వదలటం, కఫన్ మాదిరి వస్త్రాన్ని ధరించడం, మృత్యువుకై సదా సిద్ధమవటం, బీదవారిలా కనిపించటం, ఏక దైవారాధనా భావాన్ని మరింత పటిష్టం చెయ్యటం, గుడ్డలే కాక మనసుని అన్ని మాలిన్యాల నుండి కాపాడుకోవటం,
సత్య సందేశాన్ని అందజేస్తామని సంకల్పించుకోవటం, కష్టాల్ని బాధల్ని కలసికట్టుగా ఎదుర్కోవటం, సత్కార్యాల్లో ఒండొకరికి చేయూత నివ్వటం.
తల్‌బియా: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నిఅమత లక వల్ ముల్క్, లా షరీక లక. ఇది అల్లాహ్‌ా ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే నినాదం. ఇది మంచిని పెంచే సూత్రం. చెడును నివారించే మహాస్త్రం. విన్నాము, విధేయులమయ్యాము, హాజరయ్యాము అన్న మాటకి నిర్వచనం.
తవాఫ్ : తవాఫ్ చేస్తూ జీవితం కూడా ఇలాగే ఆగని పయనం అని గుర్తించటం, అను గ్రహాలు ప్రసాదించమని కోరటం, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాము, అలసి పోయాము, మమ్మల్ని క్షమించు, నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవాన్ని కోరడం.
సయీ: ఆజ్ఞాపాలన, అమ్మ (హాజిరా) అడుగుజాడల్లో నడవటం, అల్లాహ్ ప్రసన్నతకై పరుగిడటం. సయీ అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. సత్పలితాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యాన్ని పదింతలు చేస్తుంది. పాపాలని కడిగివేస్తుంది. స్వర్గపు హోదాలను పెంచుతుంది.
అరఫాలో విడిది: హష్ర్ మైదానాన్ని తలపించే సువిశాలమైన భూమి. స్పష్టంగా నీలాకాశం. అల్లాహ్ నామ స్మరణలో లీనమైన మనసు… రేపటి బహుమానం కోసం ఉబలాటం. కాలం చుట్టివేయబడింది. సమయం ఇమిడి పోయింది. చరిత్ర పునరావృ తమయింది. దాగినది బహిర్గతమయింది. ప్రపంచం నోరు మూసుకుంది. సప్తలోకాలు తదేకంగా ఈ దృశ్యాన్ని తిలకిస్తున్నాయి. సత్యం వచ్చేసింది. అసత్యం నిష్క్రమించింది. అజ్ఞానం తొక్కివేయబడింది. అపమార్గాలు మూసి వేయబడ్డాయి.
రమీ: అసత్యాన్ని విసిరివేయటం! అసత్యాన్ని తరిమి కొట్టడం! పాశవిక ప్రవృత్తిని వదలివేస్తానని ప్రతిన బూనటం! ఏమీ లేక పోయినా ఈ చిన్న చిన్న కంకర రాళ్ళతో దుష్ట శక్తులపై పోరాడుతానని ప్రతిజ్ఞచెయ్యటం! స్వార్థపరుల్ని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని, దాగి ఉన్న దొంగలనీ అంతం చేసే వరకూ నిద్రపోనని వాగ్దానం చెయ్యటం!
హల్ఖ్: పాపాలని వదలి వేస్తున్నానని తప్పులతో నిండిన శరీరాన్ని శుద్ధ పరచుకుం టాననీ, ఎలాగైతే తల వెంట్రుకల్ని తీసేసానో అలాగే తన జీవితంలో ఉన్న లోపాల్ని దూరం చేసుకుంటాననీ, అవసరమైతే తలనే పణంగా పెట్టగలనని సంకేతం ఇవ్వటం.
నహ్ర్: త్యాగధనుడు హజ్రత్ ఇబ్రాహీం (అ)కు అనుసరణగా, చెడు మనస్తత్వానికి వ్యతి రేకంగా, తండ్రి ఆజ్ఞాపాలనకు గుర్తుగా, కొడుకు ఇస్మాయీల్ (అ) వినయానికి ప్రతీకగా ఇచ్చే ఖుర్బానీ.
Subscribe to:
Comments (Atom)



