Sunday, August 24, 2014

జుమా నమాజు


అబూ హురైరా(ర) కథనం ఆయన దైవప్రవక్త(స) వారిని ఇలా చెబుతుండగా విన్నారు: ”రేపు ప్రళయ దినాన అందరి తర్వాత వచ్చి అందరికన్నా ముందుండే సముదాయం మేమే అవుతాము. యూద క్రైస్తవులకు మనకన్నా ముందు గ్రంథం ఇవ్వబడింది, వారు ఆ విషయంలో విభేదించుకున్నారు. ప్రతి విషయంలోనూ ప్రజలు మా వెనకాలే ఉంటారు. మమ్మల్నే అనుసరిస్తారు. ”యూదులు రేపు, క్రైస్తవులు మర్నాడు” అన్నారు. (బుఖారీ 836, ముస్లిం 855)
అయితే జుమా నమాజు హిజ్రత్‌కి పూర్వం మక్కాలో విధి గావించబడింది. అయితే మక్కాలో ఉన్నంతకాలం అది స్థాపించ బడలేదు. కారణం ప్రవక్త(స)వారి సహచరులు చాలా దయనీయ స్థితిని ఎదుర్కుంటూ ఉండేవారు గనక. హజ్రత్‌ అస్‌అద్‌ బిన్‌ జరారా(ర) గారు ప్రవక్త(స)వారి మదీనా ఆగమనానికి (హిజ్రత్‌కి) పూర్వమే మదీనాలో జుమా నమాజు స్థాపించారు. కాబ్‌ బిన్‌ మాలిక్‌(ర) గారి కథనం ద్వారా మనకీ విషయం బోధపడుతుంది.
ఆధారం:
”ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్‌ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్‌ా ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.(జుమా:9)
అబూ హురైరా(ర) మరియు అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌(ర) కథనం మేరకు వారిరువురూ ప్రవక్త(స) వారి వేదిక మీద ఈ విషయం చెబుతుండగా విన్నారు: ”ప్రజలు జుమా నమాజులు వదలడం మానుకోవాలి లేదా అల్లాహ్‌ా వారి హృదయాలకు ముద్ర వేస్తాడు. ఫలితంగా వారు శాశ్వతంగా ఏమరుపాటుకు లోనయ్యే ప్రమాదం ఉంది.” (ముస్లిం 865)
జుమా నమాజు షరీయతు బద్ధం చేయడం వెనకాల పరమార్థం:
జుమా నమాజు విధి చేయడం వెనకాల అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమయినవి- పట్టణంలో నివసించే, ఊరిలో నివసించే ప్రజలంతా పరస్పరం ఒక చోట కలుసుకోవటం. ఆ ప్రదేశమే జామె మస్జిద్‌. ఈ కలుసుకోవడం అనేది వారానికోసారి జరుగుతుంది. వారందరూ ధర్మోపదేశాన్ని వినేందుకు హాజరవుతారు. అలా వారు ప్రోగవ్వడం వారి మధ్య ఐకమత్యాన్ని, సోదరభావాన్ని మరింత దృఢతరం చేస్తుంది. ఈ కారణంగానే ఇస్లాం జుమా నమాజు కోసం హాజరవ్వమని ప్రోత్సహించింది. దాన్ని విడనాడటం నుంచి వారించింది.
జుమా విధి అవ్వడానికి షరతులు
1. ముస్లిం అయి ఉండాలి.
2.యౌనస్తుడయి ఉండాలి.
3. బుద్ధిమంతుడయి ఉండాలి.
4. స్వాతంత్రుడయి ఉండాలి. బానిస మీద జుమా వాజిబ్‌ కాదు.
5. పురుషుడయి ఉండాలి. స్త్రీలపై వాజిబ్‌ కాదు.
6. దేహ ఆరోగ్యం కలిగి ఉండాలి. వ్యాధిగ్రస్తుని మీద జుమా లేదు.
7. జుమా నిర్వహించబడుతున్న ప్రదేశంలో నివాసం (స్థానికుడయి) ఉండాలి. బాటసారిపై నమాజు లేదు. అలాగే స్థానికుడు సయితం జుమా నెరవేరని ప్రదేశంలో ఉంటే జుమా అతనిపై వాజిబ్‌ కాదు. ఉదాహరణకు: నలభయి మందికన్నా తక్కువ ముస్లిం జనాభా గల ఊరిలో అతనున్నాడు, దాంతోపాటు ఏ సమీప పట్టణంలోనయితే జుమా నిర్వహించబడుతుందో అక్కడి అజాన్‌ సయితం విన్పించడం లేదంటే అలాంటి వ్యక్తిపై జుమా వాజిబ్‌ కాదు.
తారిఖ్‌ బిన్‌ షిహాబ్‌ (ర) గారి కథనం- దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”జుమా నమాజు సామూహికంగా చేయడం ముస్లిం అయిన ప్రతి వ్యక్తిపై తప్పనిసరి విధి. అయితే నలుగురికి మినహాయింపు ఉంటుంది: బానిస, స్త్రీ, ప్రాజ్ఞ వయసుకు చేరని బాలుడు, వ్యాధిగ్రస్తుడు.” (అబూ దావూద్‌ 1067)
మరో ఉల్లేఖనంలో ప్రవక్త(స) ఇలా అన్నారు: ” అజాన్‌ విన్న ప్రతి ముస్లింపై జుమా విధి అవుతుంది.”
(అబూదావూద్‌ 1056)
జుమా నెరవేరేందుకు షరతులు:
పై ఏడు షరతులు పూర్తయితే జుమా నమాజు విధి అవుతుంది. అయితే నమాజు నెరవేరాలి అంటే క్రింది నాలుగు షరతులు కూడా పూర్తవ్వాలి:
1. జుమా నమాజు భవనాలు, ఇళ్ళు గల ప్రదేశంలో స్థాపించాలి. అది పట్టణమయినా 40 మంది నివసించే పల్లెసీమ అయినా పరవాలేదు.
2. జుమా నమాజు చేయబడే ప్రదేశంలో జుమా నమాజు విధి అయ్యే ముగ్గురు 40 తీరాలి. వారు స్థానికులైన
పురుషులు. (ఇది షాఫయి మస్లక్ను అనుసరించే వారి అభిప్రాయం. ఇతర పండితులు ముగ్గురు ఉంటె కూడా జుమా ఫర్జ్ అవుతుంది అంటారు)
3. జుమా నమాజు జుహ్ర్‌ నమాజు సమయంలో చేయబడుతుంది. ఒకవేళ అలా కుదరకపోతే వారు నాలుగు రకాతులు
చదవుకోవాలి.
హజ్రత్‌ అనస్‌ (ర) గారి కథనం- దైవ ప్రవక్త (స) ‘పొద్దు వాలే సమయంలో జుమా నమాజు చేసే వారు” (బుఖారీ-862)
హజ్రత్‌ సహల్‌ బిన్‌ సఅద్‌ (ర) గారి కథనం – మేము మధ్యాహ్న భోజనం గానీ, ఖైలూలా (కునుకుపాటు) గానీ జుమా నమాజు అనంతరమే చేసేవారము”. (బుఖారీ – 897)
4) ఒకే పట్టణం అనేక జుమాలు నిర్వహించకూడదు. వీలయినంత వరకూ పట్ట ప్రజలంతా ఒకే చోటు జుమా నమాజు చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ స్థలం సరిపోవకపోతే అప్పుడు ఒకటికి మించిన జుమాలు ఒకే పట్టణంలో చేసుకునే అనుమతి ఉంటుంది. ఒకవేళ ఏ అవసరమూ లేకుండానే ఒకే పట్టణంలో అనేక జుమా నమాజులు చేయబడుతున్నాయంటే వాటిలో మొదట ప్రారంభమయిన జుమా నమాజు మాత్రమే ఆమోదయోగ్యమవుతుంది. మిగతావన్నీ రద్దు చేయబడతాయి. వారు దానికి బదులుగా జుహర్‌ నమాజు చేసుకోవాలి.
ఈ షరతు పరమార్థం ఏమిటంటే, జుమా ముఖ్యోద్దేశం అయిన ఐక్యత ప్రాప్తమవుతుంది.
జుమా ఫర్జ్‌లు
మొదటిది: రెండు ఖుత్బాలు
1) ఈ రెండు ఖుత్బాల్లోనూ సాధ్యమయినంత వరకూ నిలబడాలి. ఈ రెంటికి మధ్యలో కూర్చోవడం ద్వారా వాటిని వేరుపర్చవచ్చు.
హజ్రత్‌ జాబిర్‌ (ర) గారి కథనం- ”నిశ్చయంగా దైవప్రవక్త (స) నిలబడి ఖుత్బా ఇచ్చేవారు. ఆ తర్వాత కూర్చునేవారు. తిరిగి మళ్ళి నిలబడి ఖుత్బా ఇచ్చేవారు”. (ముస్లిం: 862)
2) నమాజు తర్వాత చేయకూడదు: జుమా నమాజు గురించి వచ్చిన అనేక హదీసుల ఆధారంగా, మరియు ఈ విషయంలో ముస్లింలందరి సమైక్యత కారణంగా ఖుత్బాను ఆలస్యం చేసి చెప్పకూడదు.
3) ఖతీబ్‌ (ప్రసంగీకులు) హదసె అస్గర్‌, మరియు హదసె అక్బర్‌ నుండి శుద్ధి పొంది ఉండాలి. అలాగే స్థలం, దేహం, దుస్తులు సయితం పరిశుభ్రంగా ఉండాలి. మర్మావయవాలు కప్పబడి ఉండాలి. ఎందుకంటే, ఖుత్బా నమాజు వంటిదే. ఈ కారణంగానే రెండు ఖుత్బాలు జుహర్‌ రెండు రకాతు స్థానంలో భావించబడ్డాయి. నమాజు కోసం ఏ షరతులు అవసరమో అవే షరతులు ఖుత్బా కోసం కూడా వర్తిస్తాయి.
.
4) ఖుత్బా అర్కానులను అరబీలోనే ఉచ్చరించాలి: ప్రసంగీకులు అరబీలోనే ఖుత్బా ఇవ్వాలి. అది నమాజీలకు అర్థం కాకపోయినా సరే. ఒకవేళ అరబీ తెలిసినవారు ఎవరూ లేక, సుదీర్ఘ కాలం గడిచినా వారిలో ఎవ్వరూ అరబీ నేర్చుకోకపోతే ఆ పాపం వారందరిపై ఉంటుంది. వారి జుమా చదవకూడదు, దానికి బదులు జుహ్ర్‌ా నమాజు చేెసుకోవాలి. అరబీ నేర్చుకోగలిగే పరిమిత సమయంలో జుమా అర్కానులను ఏ భాషలో అనువదించినా జుమా నమాజు నెరవేరుతుంది.
5) ఖుత్భా అర్కానుల మధ్య క్రమాన్ని పాటించడం: మొదటి మరియు రెండవ ఖుత్బాకి మధ్య, రెండవ ఖుత్బా నమాజుకి మధ్య క్రమాన్ని పాటించాలి (ఒకటి తర్వాత ఒకటి వెనువెంటనే చేయాలి). ఒకవేళ మొదటి మరియు రెండవ ఖుత్బాకి మధ్య విరామం సుదీర్ఘమయినా, రెండవ ఖుత్బా మరియు నమాజుకి మధ్య విరామం సుదీర్ఘమయినా ఖుత్బా నెరవేరదు. దాన్ని నివారించగలిగేంత సమయం ఉంటే మళ్ళీ వాటిని చేయాలి. సమయం అయిపోతే జుమా స్థానంలో జుహ్ర్‌ా నమాజు చేెసుకోవాలి.
6) ఖుత్బా అర్కానులు మంది వినగలిగేంత హెచ్చు స్వరంతో ఇవ్వాలి.
ఖుత్బా అర్కానులు
1) అల్లాహ్‌ స్తోత్రం; స్తోత్రం క్రిందికి వచ్చే ఏ పదాలతోనయినా సరే.
2) ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై దరూద్‌. దరూద్‌గా వచ్చిన ఏ పదాలతోనయినా సరే. అయితే షరతు ఏమిటంటే స్పష్టంగా ఆయన పేరును ఉచ్చరించాలి; దైవప్రవక్త, సందేశహరుడు లేదా ముహ్మద్‌ అని. పేరుకి బదులు సూచనాప్రాయంగా ఏదయినా పదాన్ని వాడకూడదు.
3) దైవభీతిని గురించి హితవు పలకడం, ఎలాంటి పదాలు, పద్ధతితోనయినా.
ఈ మూడు ఖుత్బా అర్కానులు అనబడతాయి. వీటిని ప్రస్తావించకుండా ఖుత్బా నెరవేరదు.
4) రెండు ఖుత్బాలో ఏదోక ఖుత్బాలో ఖుర్‌ఆన్‌ వచనాన్ని చదవడం: చదివే ఆయతు స్పష్టంగా, అర్థమయ్యేలా ఉండాలి. సూరా ప్రారంభంలో వచ్చే అక్షరాలను చదివితే సరిపోదు.
5) రెండవ ఖుత్బాలో ముస్లింలందరి కోసం దుఆ చేయాలి.
రెండవది: సామూహికంగా రెండు రకాతుల నమాజు చదవడం.
హజ్రత్‌ ఉమర్‌ (ర) ఇలా అన్నారు: ”దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి మాట ప్రకారం-”జుమా నమాజు రెండు రకాతులు”.
(నసాయీ -111/3)
జుమా నమాజ్‌ కొరకు ఆలస్యంగా వచ్చేవారు:
1.జమాతుతో ఒక రకాతును పొందడం షరతు. ఒక రకాతుని పొందని పక్షంలో సదరు వ్యక్తి జుహ్ర్‌ా చేసుకోవాలి.
2.ఆలస్యంగా వచ్చిన వ్యక్తి రెండవ రకాతులో ఇమామ్‌ రుకూ నుండి లేచిన మీదట వచ్చి కలుసుకుంటే అతని జుమా నెరవేరదు. ఇమామ్‌ సలామ్‌ చెప్పిన పిమ్మట అతను జుహ్ర్‌ా నమాజు చేసుకోవాలి.
3.ముక్తదీన్లు కొందరు జుమా నమాజులో ఇమామ్‌ను అనుసరిస్తూ ఒక రకాతు చదివి తర్వాత అనివార్య కారణం వల్ల వేరయి ఎవరికి వారుగా నమాజు పూర్తి చేసుకుంటే వారి నమాజు నెరవేరుతుంది. అదే అనివార్య కారణం మొదటి రకాతు పూర్తి కాక ముందే ఏర్పడి వారు వేరయితే వారి జుమా నెరవేరదు. దాని స్థానంలో జుహ్ర్‌ా చేసుకోవాల్సి ఉంటుంది.
జుమా ఆదాబులు (మర్యాదలు)
1) గుసుల్‌ – స్నానం
2) శరీరాన్ని మలీనాల నుండి శుభ్ర పర్చుకోవడం. పురుషులు సువాసన పూసుకోవడం, నూనె రాసుకోవడం.
హజ్రత్‌ సల్మాన్‌ ఫారసీ (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఎవరయినా జుమా రోజు గుసుల్‌ చేసి, వీలయినంత వరకు పరిశుభ్రతను పాటించి, నూనె రాసుకొని, తన ఇంటి నుండి సువాసన పూసుకొని నేరుగా మస్జిద్‌కు వెళ్ళి ఏ ఇద్దరి మధ్య చీలిక ఏర్పరచకుండా, అక్కడ తాను చేయగలిగినన్ని నమాజులు చేసి, ఆ తర్వాత ఇమామ్‌ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉంటే గత జుమా నుండి ఆ జుమా వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి”. (బుఖారీ – 843)
3) మంచి దుస్తులు ధరించడం.
4) గోళ్ళు కత్తిరించడం, ఎంట్రుకలు సవరించుకోవడం.
5) తొందరగా మస్జిద్‌కు బయలుదేరడం.
హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం: దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఎవరయితే జుమా రోజు లైంగిక అశుద్ధావస్థ నుండి పరిశుద్ధత పొందడానికి చేస్తున్నంత చక్కగా స్నానం చేసి జుమా నమాజు చదవడానికి ప్రధమ సమయంలో వెళతాడో అతడు ఒక ఒంటెను ఖుర్బానీ ఇచ్చినట్లు. ద్వితీయ సమయంలో వెళ్ళిన వ్యక్తి ఒక ఆవును ఖుర్బానీ ఇచ్చినట్లు. త్వితీయ సమయంలో వెళ్ళిన వ్యక్తి కొమ్ములు తిరిగిన పొట్టేలును ఖుర్బానీ ఇచ్చినట్లు. నాల్గవ వేళలో వెళ్ళిన వ్యక్తి ఒక కోడిని ఖుర్బానీ ఇచ్చినట్లు. ఐదవ సమయంలో వెళ్ళిన వ్యక్తి ఒక గ్రుడ్డును దానం చేసినట్లు. ఆ తర్వాత ఇమాము (ఖుత్బా ఇవ్వడానికి) బయలుదేరి రాగానే దైవదూతలు (హాజరు వేయడం ఆపి) హితోపదేశం వినడానికి మస్జిద్‌లోకి వచ్చేస్తారు”. (బుఖారీ – 841, ముస్లిం – 850)
6) మస్జిద్‌లో ప్రవేశించినప్పుడు రెండు రకాతులు నమాజ్‌ చేసుకోవాలి:
హజ్రత్‌ జాబిర్‌ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”మీలోని ఒకరు జుమా నమాజు కోసం వచ్చినప్పుడు ఇమామ్‌ ప్రసంగిస్తుంటే, రెండు రకాతులు చదువుకోవాలి, వాటిని తెలికపాటివిగా చేసుకోవాలి”.(ముస్లిం-875)
ఈ అనుమతి ఇమామ్‌ తన ప్రసంగాన్ని ముగిసే సమయంలో అయితే ఉండదు, అతను ఫర్జ్‌ నమాజు కోసం వేచి చూడాలి. అతను ఒకవేళ కూర్చుంటే కూర్చున్న తర్వాత లేచి చదివిన నమాజు ఆమోదయోగ్యం కాజాలదు. కూర్చున్న వ్యక్తి మౌనంగా ఖుత్బాను శ్రద్ధగా వినాలి అంతే.
7) రెండు ఖుత్బాల కోసం మౌనం:
హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”జుమా రోజున ఇమామ్‌ ఖుత్బా ఇచ్చే సమయంలో నీవు నీ సోదరుణ్ణి ఊరుకో అని చెప్పినా అది అనవసర చర్యగా భావించబడుతుంది”.
(బుఖారీ-82,ముస్లిం-851)
జుమా దిన మర్యాదలు
1) సూరయె కహఫ్‌ పారాయణం
2) ఆ పగలు రాత్రి అత్యధికంగా దుఆ చేయడం.
దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”జుమా రోజు ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో విశ్వాసి నిలబడి నమాజు చేస్తూ – అల్లాహ్‌తో ఏదయినా కోరితే అది అతనికి అనుగ్రహించబడుతుంది”. (బుఖారీ- 852)
1) జుమా రేయింబవళ్ళలో దైవప్రవక్త (స) వారి మీద అత్యధికంగా దరూద్‌ పంపాలి:
దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీ రోజులలో అత్యంత శ్రేష్ఠమైన రోజు శుక్రవారం. కనుక మీరు ఆ రోజు అత్యధికంగా నాపై దరూద్‌ పంపించండి. నిస్సందేహంగా మీరు పంపే దరూద్‌ నాకు చేరవేయబడుతుంది”. (అబూ దావూద్‌-1047)
పరీక్ష – 19
సరైన సమాధానాన్ని ఎన్నుకోండి
1) జుమా నమాజు కోసం వెళ్ళ దలచుకున్న వ్యక్తి గుసుల్‌ ……………………..గా భావించబడుతుంది.
అ) ఫర్జ్‌
ఆ) ముబాహ్
ఇ) సున్నత్‌
2) నమాజీల కోసం స్థలం సరిపడక పోతే అట్టి స్థితిలో రెండు జమాతులుగా నమాజు చేసుకునే………….
అ) అనుమతి ఉంటుంది.
ఆ) అనుమతి ఉండదు.
3) అబ్దుర్రహ్మాన్‌ అనే వ్యక్తి ఇమామ్‌ మొదటి ఖుత్బా ఇస్తుండగా వచ్చి రెండు రకాతులు నమాజు చేసి తర్వాత కూర్చున్నాడు. అతనికి అనుమతి…
అ) ఉంది.
ఆ) లేదు.
4) జుమా రోజు సూరతుల్‌ కహఫ్‌ చదవడం పురుషుల కోసం………………స్త్రీల కోసం ………..
అ) ఫర్జ్‌ – ఫర్జ్‌
ఆ) సున్నత్‌ – సున్నత్‌
ఇ) ఫర్జ్‌ – సున్నత్‌


    5) ఒకే పట్టణంలో ఏ కారణం లేకుండా అనేక జుమా నమాజులు నిర్వహించబడితే వాటిలో మొదట ఏ నమాజు ముగిస్తుందో అది నెరవేరినట్లు మిగతావన్నీ నెరవేరనట్లుగా భావించబడుతోంది.
    అ) అవును
    ఆ) కాదు.
    6) ఖుత్బా ఇచ్చే సమయంలో ఇమాము వీలయినంత వరకు నిలబడాలి.
    అ) అవును
    ఆ) కాదు.
    7) జుమా నమాజు సామూహికంగా చేయడం విధి.
    అ) అవును.
    ఆ) కాదు.
    8) జుమా నమాజును ఆలస్యం చేసి మగ్రిబ్‌ నమాజుకు ముందు కూడా చదువుకోవచ్చు.
    అ) అవును
    ఆ) కాదు.
    9) జుమా ఖుత్బా జుమా నమాజుకన్నా ముందు నిర్వహించాలి.
    అ) అవును
    ఆ) కాదు.

    నఫిల్‌ నమాజులు


    నఫిల్‌ నమాజులు రెండు రకాలు
    1.జమాఅత్‌తో చేయబడేవి
    2.జమాఅత్‌తో చేయనివి
    జమాఅత్‌తో చేయబడే నఫిల్‌ నమాజులు
    (అ) ఫర్జ్‌తో సంబంధమైనవి
    (ఆ) ఫర్జ్‌తో సంబంధం కానివి
    ఫర్జ్‌తో సంబందమైనవి రెండు రకాలు
    (అ) సున్నతె ముఅక్కదహ్‌ా
    (ఆ) సున్నతె గైర్‌ ముఅక్కదహ్‌ా
    (అ) సున్నతె ముఅక్కదహ్‌ా:
    జమాతుతో చేయడం సున్నత్‌ కాని నఫిల్‌ నమాజులు
    ఫర్జ్‌తో ముడిపడినవి ఫర్జ్‌తో సంబంధం లేనివి
    సున్నతె ముఅక్కదా నిర్ణీత సమయంలో చేయబడేవి
    సున్నతే గైర్‌ ముఅక్కదా నిర్ధారిత సమయం పేరు లేనివి”అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌(ర)కథనం: దైవప్రవక్త(స) గారి పది రకాతులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. రెండు రకాతులు జుహ్ర్‌ నమాజుకు ముందు, రెండు రకాతులు తరువాత, మగ్రిబ్‌ తర్వాత రెండు రకాతులు, ఇంటి వద్ద చేసేవారు. అలాగే రెండు రకాతులు ఇషా ఫర్జ్‌ నమాజ్‌ అనంతరం ఇంటి వద్దనే చేసేవారు. రెండు రకతులు ఫజ్ర్‌ (నమాజుకు) ముందు చేసేవారు.” (బుఖారి 1126)
    (ఆ) సున్నతె గైర్‌ ముఅక్కదహ్‌:
    - నాలుగు రకతులు దొహర్‌కు ముందు,తర్వాత రెండు. జుమా నమాజు జుహ్ర్‌తో సమానం. ఎందుకంటే అది జుహ్ర్‌కి బదులు. దానికి ముందు నాలుగు రకతులు సున్నత్‌. రెండు ముఅక్కదహ్‌,రెండు గైర్‌ ముఅక్కదహ్‌. అదే విధంగా తర్వాత.
    - అసర్‌ నమాజుకు ముందు నాలుగు రకతులు.
    - మగ్రిబ్‌కి ముందు రెండు రకతులు.
    - ఇషా ముందు రెండు రకతులు.
    - అజాన్‌ మరియు ఇఖామత్‌ల మధ్య.
    ఫర్జ్‌తో సంబంధం కానివి రెండు రకాలు:
    1.నిర్ణీత సమయంలో చేయబడే నమాజులు
    2.సమయం లేకుండా ఎప్పుడైనా చేసుకునే నమాజులు.
    నిర్ణీత సమయాలలో చేయబడే నమాజులు:
    తహియ్యతుల్‌ మస్జిద్‌: మస్జిద్‌లో వెళ్ళిన తరువాత కూర్చోవక ముందు రెండు రకాతులు చేయడం.
    ”దైవప్రవక్త(స) ఈ విధంగా ప్రబోధించారు : మీలో ఎవరయినా మస్జిద్‌లోకి ప్రవేశిస్తే రెండు రకాతులు నమాజ్‌ చేసేంత వరకు కూర్చోకూడదు.” ( బుఖారి 433, ముస్లిం714)
    విత్ర్‌ నమాజు: ఇది సున్నతె ముఅక్కదహ్‌ా. విత్ర్‌ అంటే బేసి అని అర్థం. ఈ నమాజు బేసి రకాతుతో ముగిస్తుంది గనక దీన్ని విత్ర్‌ నమాజు అంటారు. దాని సమయం ఇషా నమాజ్‌ అయిపోయిన తర్వాత నుంచి ఉషోదయం వరకు ఉంటుంది. ఈ నమాజు రాత్రిపూట ఆఖరి సమయంలో చేయటం ఉత్తమం. గాఢనిద్రమూలంగా నమాజ్‌ తప్పిపోయే ప్రమాదముంటే ఇషా నమాజు తర్వాతే చేసుకోవలెను.
    ” దైవప్రవక్త(స) ఇలా ప్రబోధించారు: ఖుర్‌ఆన్‌ గ్రంథ ప్రజలారా! బేసి సంఖ్యలో నమాజ్‌ చేయండి. నిస్సందేహంగా అల్లాహ్‌ా ఒక్కడే. బేసినే ప్రేమిస్తాడు.” (అబూదావూద్‌ 1416)
    అబూహురైరా(ర) కథనం: నా మిత్రులు (ముహమ్మద్‌(స)) నాకు మూడు విషయాల గురించి హితోపదేశం చేశారు- ప్రతినెలా మూడు రోజుల ఉపవాసం పాటించమనీ, చాష్త్‌ వేళ రెండు రకాతులు నమాజ్‌ చేయమనీ, నిద్రపోక ముందే విత్ర్‌ నమాజ్‌ చేసుకోమనీ.” (బుఖారి 1880, ముస్లిం 721)
    విత్ర్‌ నమాజ్‌ కనీస సంఖ్య ఒక రకాతు. ఒకటి లేకమూడు లేక ఐదు ఈ విధంగా పదకొండు వరకు చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ రకాతుల విత్ర్‌ నమాజ్‌ చేస్తే ప్రతి రెండు రకాతులకి సలాం చేసి చివర్లో ఒక రకాతు చేయవలెను.
    ఖియాముల్లైల్‌: నిద్రపోయి లేచి చేసే నమాజునే తహజ్జుద్‌ నమాజ్‌ కూడా అంటారు.
    ఖియాముల్లైల్‌ సున్నత్‌. ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు. నిద్ర నుంచి లేసిన తర్వాత నుండి ఫజర్‌ అజాన్‌ వరకు చేసుకోవచ్చు.
    అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”రాత్రిపూట కొంతభాగం తహజ్జుద్‌(నమాజు)లో ఖుర్‌ఆన్‌ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను ”మఖామె మహ్‌మూద్‌”కు (ప్రశంసాత్మకమైన, స్థానానికి)చేరుస్తాడు.” (ఇస్రా:79)
    అబూహురైరా(ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా ప్రబోధించారు: ఫర్జ్‌ నమాజుల తర్వాత అన్నిటికంటె ఉత్తమమైన నమాజు ఖియాముల్లైల్‌. (రాత్రిపూట చేసే నమాజు). (ముస్లిం 1163)
    సలాతుజ్జుహా: (చాష్త్‌ నమాజు) చాష్త్‌ నమాజ్‌ కనిష్ఠ సంఖ్య రెండు రకాతులు. గరిష్ఠ ఎనిమిది రకాతులు. దీని సమయం సుర్యోదయం తర్వాత నుంచి మొదలయి (జవాల్‌) సూర్యుడు నెత్తి నుండి వాలక ముందు వరకు ఉంటుంది. సూర్యుడు పావు భాగం ఉదయించిన తర్వాత చేయటం ఉత్తమం.
    సలాతుల్‌ ఇస్తిఖారహ్‌: మక్రూహ్‌ కాని సమయాలలో రెండు రకాతుల నమాజ్‌. (రెండు గానీ లేదా అంతకంటే ఎక్కువ ధర్మ సమ్మతమైన పనుల్లో తనకు లాభదాయకమైన పనిని ఎన్నుకునే సద్బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని కోరటం) నమాజ్‌ చేసిన తర్వాత రూఢీ అయిన దుఆ ద్వారా దుఆ చేయటం సున్నత్‌ విధానం. అల్లాహ్‌ా ఆ పనిని చేసే సద్బుద్ధిని ప్రసాదిస్తే చేయాలి లేక పోతే వదిలేయాలి.
    జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) వివరించారు: అన్ని పనులనూ ఇస్తిఖారహ్‌ చేసే విషయంలో దైవప్రవక్త(స) ఖుర్‌ఆన్‌లోని ఏదయినా సూరాను బోధించినట్లే బోధించేవారు. ఆయన(స) సెలవిచ్చారు: ”మీలో ఎవరయినా ఏదయినా పని చేయాలను కున్నప్పుడు ఫర్జ్‌తోపాటు రెండు రకాత్‌లు నమాజ్‌ చేసి ఈ దుఆ చేయండి.
    ”అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక, వ అస్తఖ్‌దిరుక బిఖుద్‌రతిక, వ అస్‌అలుక మిన్‌ ఫజ్‌లికల్‌ అజీం, ఫఇన్నక తఖ్‌దిరు వలా అఖ్‌దిరు, వ త-లము వలా అ-లము, వ అన్‌త అల్లాముల్‌ గుయూబ్‌, అల్లాహుమ్మ ఇన్‌కున్‌త త-లము అన్న హాజల్‌ అమ్‌ర ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్‌రీ, ఫఖ్‌దుర్‌హులీ, వ యస్సిర్‌హులీ, సుమ్మ బారిక్‌లీ ఫీహ్‌ా, అల్లాహుమ్మ ఇన్‌ కున్‌త త-లము అన్న హాజల్‌ అమ్‌ర షర్రుల్లీ ఫీదీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్‌రీ ఫస్‌రిఫ్‌హు అన్నీ వస్‌రిఫ్‌నీ అన్‌హు, వఖ్‌దుర్‌ లియల్‌ ఖైర హైసు కాన, సుమ్మ అర్‌జినీ బిహీ”. (బుఖారి 1109)
    అర్థం: ఓ అల్లాహ్‌! నిస్సందేహంగా నీ నుండి జ్ఞానంతో పాటు మేలును కోరుతున్నాను. నీ మహిమతోపాటు నీనుండి శక్తిని కోరుతున్నాను. నీ గొప్ప దయను కోరుతున్నాను. నిశ్చయంగా నీవు అధికారం గలవాడవు. నాకు అధికారం లేదు, నీవు ఎరుగుదువు. నేను ఎరుగను. నీవు అగోచరాలను బాగా ఎరుగుదువు. ఓ అల్లాహ్‌ా! నీ జ్ఞానాన్ని అనుసరించి ఈ పని నా కోసం, నాధర్మం, నా ఉపాధి నా పర్యవసానానికి ఉత్తమమయినదయితే దాన్ని నా అదృష్టంలో చేర్చు. దాన్ని నా కోసం సులభం చెయ్యి. నా కోసం దానిలో సమృద్ధి నివ్వు. నీ జ్ఞానాన్ని అనుసరించి ఈ పని గనుక నాకోసం నా ధర్మం, నా ఉపాది
    మరియు నా పర్యవసానం రీత్యా చెడ్డది అయితే దాన్ని నా నుండి దూరం చెయ్యి. నన్ను దాని నుండి దూరం చెయ్యి. మేలు ఎక్కడున్నా దాన్ని నా అదృష్టంలో చేర్చు. దానిపై నన్ను సంతోషపరచు.”
    2. నిర్ణీత సమయం లేని నఫిల్‌ నమాజులు: 
    ఏ సమయాలలో నమాజ్‌ చేయడం అయిష్టకరమో(మక్రూహ్‌) ఆ సమయాలలో తప్ప ఏ సమయంలోనైనా, ఎన్ని రకాతులైనా నమాజ్‌ చేయడం. రాత్రిపూటనైనా, పగటిపూటనైనా నఫిల్‌ నమాజులు రెండేసి చదవటం ముస్తహబ్‌.
    అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమర్‌(ర) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త(స)తో రాత్రి నమాజు గురించి ప్రశ్నించాడు: దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”రాత్రి నమాజులు రెండేసి రకాతులుగా ఉన్నాయి.” ( బుఖారి 946)

    పరీక్ష 20

    సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
    (ఎ) 3 (బి) మగ్రిబ్‌కి ముందు రెండు రకాతులు (సి) ఫజర్‌కి ముందు రెండు రకాతులు (డి) 1(ఇ) 11
    (ఎఫ్‌) మగ్రిబ్‌ తర్వాత రెండు రకతులు (జి) అజాన్‌ మరియు ఇఖామత్‌ల మధ్య చేసే నమాజులు (ఎచ్‌) 13
    1. విత్ర్‌ నమాజ్‌ కనీసం………………………రకాతు. ఇంకా ………………………రకాతులు. మరియు విత్ర్‌ నమాజ్‌
    గరిష్ఠ సంఖ్య……………………..
    2……………..మరియు……………..సున్నతె ముఅక్కదహ్‌ా,కాని…………..మరియు………..సున్నతె గైర్‌ముఅక్కదహ్‌.
    సరైన సమాధాన్ని ఎన్నుకోండి:
    3.చాష్త్‌ నమాజు సమయం సూర్యుడు కొంచెం ఉదయించిన తర్వాత నుంచి ఆకాశం మధ్యలో వచ్చేవరకు ఉంటుంది.
    (అ) అవును
    (ఆ) కాదు
    4.ఖియాముల్లైల్‌ రాత్రి 10 నుండి ఉదయం 11:30 వరకు.
    (అ) అవును
    (ఆ) కాదు
    5. ఇస్తిఖారహ్‌ నమాజు రెండుపనుల్లో తనకు లాభాదాయకమైన పనిని ఎన్నుకునే సద్బుద్ధిని ప్రాదించమని కోరడం.
    (అ) అవును
    (ఆ) కాదు

    సభ్యతా సంస్కారాల సరోవరం నమాజు


    నమాజు చేసే ప్రతి వ్యక్తీ శుచీ, శుభ్రతలను పాటించటం అవశ్యం. ఇస్లాం తొలి ఆజ్ఞలలో తహారత్‌ ఒకటి. దైవప్రవక్త ముహమ్మద్‌ (స )పై రెండవసారి అవతరించిన దివ్యవాణి శుచీశుభ్రల (తహారత్‌) కు సంబంధించినదే. ఉదాహరణకు:- ”నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. అశుద్ధతను వదలిపెట్టు”. (అల్‌ ముద్దస్సిర్‌ – 4,5)
    అందుకే ఇస్లాం పరిశుభ్రత, పరిశుద్ధతలకు సంబంధించిన సూత్రాలను నిర్థారించింది. దైవప్రవక్త (లి) తన బోధనల ద్వారా దాని సరిహద్దులను ఖరారు చేశారు. నమాజు సజావుగా నెరవేరాలంటే మనిషి శరీరం, అతను తొడిగే దుస్తులతోపాటు అతను నమాజు చేసే స్థలం కూడా పరిశుభ్రంగా ఉండాలి – ఎలాంటి మలినం ఉండకూడదు. ఒకప్పుడు అరబ్బులు కూడా ఇతర అనాగరిక జాతుల మాదిరిగా శుచీశుభ్రతలను బొత్తిగా పాటించేవారు కాదు. ఉదాహరణకు ఒక పల్లెటూరి బైతు సాక్షాత్తూ మస్జిదె నబవీలోనే – అందరి సమక్షంలో – మూత్రం పోసేశాడు. సహచరులు (ర ) అతన్ని కొట్టేందుకు ఎగబడ్డారు. దైవప్రవక్త ((స ) వారందరినీ వారించారు. ”నాయనా! ఇది ప్రార్థన చేసే స్థలం. ఇలాంటి చోట మల మూత్ర విసర్జన చేయకూడద”ని ఎంతో నిదానంగా నచ్చచెప్పారు. ఆ వ్యక్తి మూత్రం పోసిన చోట నీళ్లు కుమ్మరించమని ప్రియసహచరుల్ని పురమాయించారు.
    ఒకసారి ఆయన (స ) ఒక సమాధి దగ్గరి నుంచి సాగిపోతూ, ”ఈ సమాధిలోని వ్యక్తి యాతనకు గురవుతున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి (వల్ల జరిగిన అశ్రద్ధ ఏమిటంటే) మూత్రపు తుంపరలు తన శరీరంపై పడుతున్నా లక్ష్యపెట్టేవాడు కాదు” అన్నారు. ఈ విధంగా ముస్లింలు శుచీశుభ్రతల విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలని నొక్కి వక్కాణించబడింది. కాలకృత్యాలు తీర్చుకునే విషయంలోనూ, వుజూ గుసుల్‌ విషయంలోనూ గొప్ప నాగరీక జాతులు సయితం పాటించని మర్యాదలు ముస్లింలకు బోధించ బడ్డాయి.
    తమ శరీరాన్ని, దుస్తులను, నివాస గృహాలను అన్ని రకాల మలినాల నుండి కాపాడుకుంటూ షరీయతు బద్ధంగా తహారత్‌ పాటించే ప్రవక్త శిష్యులను అల్లాహ్‌ా ఈ విధంగా కొనియాడాడు:
    ”ఈ మస్జిద్‌లో ఉండే వారిలో కొందరు బాగా పరిశుద్ధతను పాటించటాన్ని ఇష్టపడతారు. అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించే వారంటే ఎంతో ఇష్టం”. (దివ్యఖుర్‌ఆన్‌ – 9:108)
    దేవుని ప్రేమాభిమానానికి పరిశుభ్రత (తహారత్‌) ఒక ప్రధాన కారణమైనప్పుడు ఈ భాగ్యానికి ఎవరయినా ఎలా దూరంగా ఉండగలుగుతారు??
    నమాజు వల్ల కలిగే ఇంకొక ప్రయోజనమేమిటంటే, అది మనిషిని అనుదినం నీటుగా ఉండేలా చేస్తుంది. అతడు నిత్యం తన ఒంటిని, దుస్తులను శుభ్రంగా ఉంచుకుంటాడు. నమాజు చేసే వ్యక్తి రోజుకు ఐదు సార్లు తన ముఖాన్ని, కాళ్ళుచేతులను నియమబద్ధంగా కడుక్కుంటాడు. ముక్కులో సయితం నీళ్ళు జొన్పి నాసిక పుటాలను శుభ్రపరుస్తాడు. దీనివల్ల వైద్య పరంగా కలిగే లాభాలు ఎన్నో. ముక్కు పుటాల మార్గంగ ుండా శరీరం లోపలికి వెళ్ళే సూక్ష్మక్రిములు ఈ ‘వుజూ’ ద్వారా దూర మవుతాయి.
    ముక్కులో సయితం నీరు పోసి శుభ్రపరచే శిక్షణ బహుశా ఇస్లాం ఒక్కటే ఇచ్చింది. ప్రపంచంలో మరే మతం కూడా ఈ శిక్షణ ఇవ్వదు. దీన్నిబట్టి ఇస్లాం ఆదేశాలు వైద్యశాస్త్రం దృష్ట్యా కూడా ఎంతో మేలైనవే. ఒకప్పుడు నీరు అతి తక్కువ మోతాదులో లభ్యమయ్యే అరబ్బు ప్రదేశంలో రోజుకు ఐదు సార్లు ‘వుజూ’ చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పటం ఇస్లాంకే చెల్లింది.
    అరబ్బులు – ముఖ్యంగా పల్లెటూళ్లలోని వారు – పల్లు తోము కోవడం పట్ల మరీ సోమరితనం ప్రదర్శించేవారు. తత్కారణంగా నోట్లో నుంచి దుర్వాసన రావటమేగాకుండా, రకరకాల దంత వ్యాధులు కూడా సోకేవి. మహా ప్రవక్త (స ) ప్రతి నమాజు సందర్భంగా ‘మిస్వాక్‌’ (దంత ధావనం) చేయాలని తాకీదు చేశారు. ”ఒకవేళ నా అనుచర సమాజం ఇబ్బందికి గురవ దనుకుంటే మిస్వాక్‌ చేయటాన్ని అవశ్యంగా ఖరారు చేెసి ఉండేవాణ్ణి” అని ఆయన (స ) చెప్పటం గమనార్హం.


      అలాగే వీలునుబట్టి స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేశాక పొడి దుస్తులు ధరించటం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం మంచిది. ముఖ్యంగా శుక్రవారం (జుమా) నమాజుకైతే స్నానం చేసి మరీ రావాలి.

      ఆరాధన – పరమార్థం


      ఇస్లాంలో ఆరాధన ఉద్దేశ్యం చాలా విస్తృతమైనది. నమాజ్, రోజా, జకాత్, హజ్‌లతోపాటు నిత్యజీవితంలో ఆచరించబడే ఆచరణలు కూడా ఆరాధనలో భాగమేనని ప్రకటించింది. మనిషి తన స్వప్రయోజనంకోసం, ఇతరుల మంచికోసం ఆచరణలు చేస్తాడు. ఈ ఆచరణలు చిత్తశుద్ధితో దైవప్రసన్నతకోసం, దైవ సామీప్యాన్ని పొందే సంకల్పంతో చేస్తే, అవి చిన్న ఆచరణలైనా కొండంత పుణ్యాన్ని కూడపెడతాయి. సామూహిక ప్రయోజనం చేకూర్చే ప్రతి ఆచరణను ఇస్లాం ఉత్తమ ఆదరణ అని పేర్కొంది.
      కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, బాధితులకు సహకరించడం, యాచకునికి సహాయం చేయడం, నిరాశ్రయునికి ఆశ్రయం కల్పించడం, నిరక్షరాస్యునికి అక్షరబోధన చెయ్యడం, దారిలో ఉన్న ప్రమాదభరిత వస్తువును ఏరిపారవేయడం, సోదరునితోను, పొరుగువానితోను ఆప్యాయంగా పలకరించడం, కన్నవారిని అంటే తల్లిదండ్రులను ప్రేమగా చూడటం… మొదలైనవన్నీ ఆరాధనకు మారురూపాలే.
      దైవమార్గంలో ఖర్చు చేసేందుకు నా వద్ద ఒక్క పైసా లేదని, నేను ఏవిధంగా పుణ్యకార్యాలు చేసేదని ప్రవక్త (స)ను అడగ్గా ఆయన (స) ‘‘నీవు మంచిని గురించి ఆజ్ఞాపించు, చెడును నివారించు లేదా అజ్ఞానికి జ్ఞానాన్ని ప్రసాదించు లేదా బాధితునికి సహాయపడు లేదా మార్గమధ్యంలో పడివున్న హానికర వస్తువును దూరం చెయ్యి’’ అన్నారు. ఇంకా చెవిటివానికి వినిపించడం, అవిటివానికి సహకరించడం, గ్రుడ్డివానికి దారిచూపించడం, జంతువు దాహం తీర్చటం,ఆకలితో వున్నవానికి అన్నం పెట్టడం, మొక్కను నాటడం – అవన్నీ ఆరాధనలే.


        ఇస్లామీయ ఆరాధనల అసలు లక్ష్యం – ఆత్మసంస్కరణ, ఆత్మప్రక్షాళన. ఈ శిక్షణ, సంస్కరణల ద్వారా మనిషి దైవసామీప్యానికి చేరుకుంటాడు. ఉదాహరణకు ‘రోజా’ను తీసుకున్నట్లయితే – దైవాదేశమైన రోజాను పాటించి దైవవిధేయతను ఉపవాసి చాటుకున్నాడు. ఆ దైవాదేశమెలాంటిదైనా, ఎంతటి కష్టతరమైనదైనా విశ్వాసి దాన్ని పాటించి సంపూర్ణ దైవవిధేయతను చాటుకుంటాడు. ‘ఆరాధనల అసలు పరమార్థం – ఆత్మసంస్కరణ, ఆత్మప్రక్షాళన’

        జుమా నమాజ్‌


        జుమా నమాజ్‌ చేయటం విధి. దాని గురించి దేవుడు ఇలా ఆదేశిస్తున్నాడు: ”విశ్వసించిన ప్రజలారా! శుక్రవారం నాడు నమాజ్‌ కోసం పిలిచినప్పుడు, అల్లాహ్‌ా సంస్మరణ వైపు పరుగెత్తండి; క్రయవియ్రాలను వదలి పెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది”. (అల్‌ జుమా: 9)
        దైవవ్రక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”పుట్టుక రీత్యా మనం గత సమాజాల వారందరికంటే చివర్లో ఉన్నా, స్వర్గానికి ముందుగా మనమే వెళ్తాం.  శక్రవారం (నాడు చేసే ఆరాధన) అందరిపైనా విధిగా చేయబడింది. కాని యూదులు, క్రైస్తవులు దాంతో విభేదించారు. యూదులు తమ ఆరాధన కోసం (తామే స్వయంగా) శనివారాన్ని నిర్ణయించుకున్నారు. క్రైస్తవులు ఆదివారాన్ని ఎంచుకున్నారు. అయితే ముస్లింల కొరకు దేవుడు శుక్రవారం రోజును నిర్ణయించాడు”. (బుఖారీ, ముస్లిం)

        జుమా నమాజు నుంచి మినహాయించబడినవారు

        దైవవ్రక్త (స) ఇలా ప్రబోధించారు: ”జుమా నమాజును సామూహికంగా చేయడం ముస్లింలందిపై విధిగా చేయబడింది. అయితే బానిసలకు, స్త్రీలకు, పిల్లలకు, వ్యాధిగ్రస్తులకు, ప్రయాణికులకు ఇందులో మినహాయింపు ఉంది”. (అబూ దావూద్‌)

        జుమా ఘనత, ప్ర్రాముఖ్యత

        1) వారాలన్నింటికీ నాయకుడు లాంటిది శుక్రవారము (జుమా రోజు).
        2) దేవుడు హజ్రత్‌ ఆదం (తి)ను పుట్టించింది జుమా రోజునే.(ముస్లిం)
        3) ఆ రోజే దేవుడు ఆదం (అ)ను భూమి మీదకు దింపాడు. (ముస్లిం)
        4) ఈదుల్‌ ఫితర్‌ (రమజాన్‌), ఈదుల్‌ అజ్హా (త్యాగోత్సవం) దినాలకన్నా జుమా రోజు శ్రేష్ఠమైనది. (ముస్నదె అహ్మద్‌)
        5) జుమా రోజున ఒక ఘడియ వస్తుంది. ఆ సమయంలో దుఆ చేస్తే తప్పకుండా ఆమోదించబడుతుంది. దేవుని నుండి మంచిని ఆశించేవారికి అది తప్పకుండా లభిస్తుంది. బహుశా ఆ ఘడియ అస్ర్‌ నమాజ్‌ తర్వాత రావచ్చు. (అహ్మద్‌)
        6) దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”ఎవరైనా జుమా రోజు గుసుల్‌ చేసి జుమా నమాజు కొరకు మస్జిద్‌కు వెళ్ళి అక్కడ తను చేయగలిగినన్ని నమాజులు చేసి, ఆ తర్వాత ఉపన్యాసం ముగిసే వరకు నిశ్శబ్ధంగా ఉండి, శ్రద్ధగా ఉపన్యాసం విని ఇమామ్‌తోపాటు ఫర్జ్‌ నమాజ్‌ చేస్తే గత శుక్రవారం నుండి ఆ శుక్రవారం వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి. అంతే కాదు, అదనంగా మరో మూడ్రోజుల పాపాలు కూడా  క్షమించబడతాయి. (ముస్లిం)
        7)  దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”సూర్యుడు ఉదయించే రోజులన్నింటిలోకెల్లా జుమా రోజు అత్యంత శ్రేష్ఠమైనది. ఆదం (అ) పుట్టింది ఆ రోజే. ఆ రోజే ఆయన స్వర్గంలోకి ప్రవేశించారు. తిరిగి అదే రోజు ఆయన స్వర్గం నుండి భూమి మీదకు వచ్చారు. ప్రళయం కూడా అదే రోజు వస్తుంది”. (ముస్లిం)
        8) హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం ప్రకారం  దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”జుమా రోజు దైవదూతలు మస్జిద్‌ ద్వారం వద్ద నిలబడి జుమా నమాజు కొరకు మస్జిద్‌కు వచ్చేవారి పేర్లు వరుసగా నమోదు చేస్తూ ఉంటారు. మస్జిద్‌కు తొలి వేళప్పుడు వచ్చినవారికి ఒక ఒంటె ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. తరువాత వచ్చినవారికి పొట్టేలును ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. చివర్లో వచ్చేవారికి కోడి, ఆ తర్వాత వచ్చేవారికి గ్రుడ్డు దానం  చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఇమామ్‌ ఖుత్బా ఇవ్వడానికి బయలుదేరగానే దైవదూతలు రిజిష్టర్‌ మూసేసి ఖుత్బా వినడానికి కూర్చుంటారు”. (బుఖారీ, ముస్లిం)

        దైవప్రవక్త (స) ఆగ్రహం

        దైవప్రవక్త (స) జుమా నమాజు చేయనివారిపై మండిపడుతూ, ”ప్రజలకు నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి జుమా నమాజుకు రాని వారిని పట్టుకుని వారి ఇళ్ళ సమేతంగా వారిని దహనం చేయాలని అనిపిస్తోంది” అని అన్నారు. (ముస్లిం)

        వరుసగా జుమా నమాజులు ఎగవేసేవాడి పర్యవసానం

        ఆయన ఇంకా ఇలా అన్నారు: ”తగిన కారణం లేకుండా సోమరితనంతో వరుసగా మూడు జుమా (నమాజు)లు ఎగ్గొట్టినవారి హృదయాలను (సన్మార్గ భాగ్యం లభించకుండా) దేవుడు సీలు చేసేస్తాడు”. (అబూ దావూద్‌)
        వేరొక హదీసులో ఇలా ఉంది: ”ప్రజలు జుమా నమాజును వదిలేయటాన్ని మానుకోవాలి లేదా దేవుడు వారి హృదయాలకు ముద్రవేస్తాడు.  తత్ఫలితంగా వారు (శాశ్వతంగా) ఏమరుపాటుకు లోనయ్యే ప్రమాదముంది”. (ముస్లిం)

        దుఆ


        అశాశ్వతమైన ఈ లోకంలో దేవుడు కష్టం, సుఖం, అదృష్టం, దురదృష్టం, మిత్రులు శత్రువులు, ఆరోగ్యం, అనారోగ్యం లాంటి సుఖదుఃఖాలెన్నింవిరినో సృష్టించాడు. మనిషి తను పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తరచూ ఇలాంటి వాటికి గురవుతూనే ఉంటాడు. అయితే దేవుడు వాటితోపాటు వాటి నుండి రక్షణ పొందటానికి ఎన్నో పద్ధతులు, ముందు జాగ్రత్తలు కూడా సూచించాడు. వాటిని ఆచరించి మనిషి తన్ను తాను కష్టాల నుండి రక్షించుకోగలడు. మానవులు రోగాలను నయం చేసుకోవటానికి ప్రార్థనలను, మందులను కూడా దేవుడు పుట్టించాడు. అందుకే దైవప్రవక్త (స) ఒకానొక సందర్భంగా ”దేవుడు ప్రతి వ్యాధికీ చికిత్సను, ఔషధాలను పుట్టించాడు” అని అన్నారు. (బుఖారీ)

        దుఆలను అల్ల్లాహ్‌ మాత్రమే ఆలకిస్తాడు

        వాస్తవానికి మానవుల్ని దుఃఖవిచారాలకు, కష్టాలు కడగండ్లకు గురి చేసేవాడూ, తిరిగి వాటి నుండి కాపాడి వారికి సౌఖ్యాన్నీ, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు కూడా దేవుడే! సృష్టిలోని ప్రతి వస్తువుపై ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉంది.  అయితే ఈ కష్టాలు, కడగండ్లకు గురైనప్పుడు తనను మొరపెట్టుకునే వారిని ఆయన అమితంగా ప్రేమిస్తాడు. ఆ విధంగా మొరపెట్టుకోవటాన్నే ‘దుఆ’ అని అంటారు.
        ”బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి, అతని బాధను దూరం చేసేవాడు ఎవడు?” (ఖుర్‌ఆన్‌- 27: 62)
        పుట్టుక రీత్యా మనిషి అవసరాలు, అక్కరలు కలవాడు. సహజంగానే అతనికి అవసరాలు ఏర్పడుతుంటాయి. అల్లాహ్‌ా మాత్రమే సర్వ సంపన్నుడు, నిరపేక్షాపరుడు. ఆయన ఇలా అంటున్నాడు:
        ”మానవులారా! మీరందరూ అల్లాహ్‌ా అవసరం కలవారే. కాని అల్లాహ్‌ మాత్రం సర్వ సంపన్నుడు, స్వయంగానే స్తుతిపాత్రుడు”. (ఖుర్‌ఆన్‌ – 35: 15)

        అల్ల్లాహ్‌ను తప్ప ఇతరులను ప్రార్థించరాదు

        మనిషి సహజంగా అవసరాలు కలవాడు అవడం చేత దుఆ తప్ప అతనికి గత్యంతరం లేదు. దుఆ మనిషికి నిత్యావసరం. మానవులు సాటి మానవుల్ని మొరపెట్టుకోవటం ప్రకృతి విరుద్ధమైన పని. స్వయంగా నిస్సహాయుడైన మానవుడు సాటి మానవుల నిస్సహాయతను దూరం చేయలేడు. అల్లాహ్‌ాను వదలి పెట్టి ఇతర సజీవినిగాని, నిర్జీవినిగాని మొరపెట్టుకోవటం ఎంత తెలివి తక్కువ పనంటే అలా చేసేవాడు నీళ్ళ ముందు నిలబడి ”వచ్చెయ్యి! నా నోట్లోకి వచ్చెయ్యి” అని నీళ్ళను పిలిచే మూర్ఖుడితో సమానం. (13: 14).
        విశ్వ సామ్రాజ్యాధిపతి అయిన అల్లాహ్‌ాను త్రోసిరాజని సజీవ లేక నిర్జీవ సృష్టిరాసుల్ని మొరపెట్టుకునేవారు ఎంత అవివేకులు?! కొందరయితే కదలలేని, మెదలలేని, కనులు విప్పి చూడలేని, పెదవి విప్పి పలకలేని రాళ్ళను తమ ఆరాధ్య దైవాలుగా చేసుకొని వాటిని తమ కష్టాల గురించి మొర పెట్టుకుంటుంటారు. ఈ వైఖరి మరీ దారుణం!
        సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్‌ా కొలువు తీర్చి, ”నన్ను మొరపెట్టుకోండి. నేను మీ మొరలను ఆలకిస్తాను” అని ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు ఆయన దాసులు ఆయన్ని వదలిపెట్టి ఇతర మిథ్యా దైవాల ముందు చేయి చాపటం ఎంత దిగజారుడుతనం?! ఒక ముస్లిం అలాంటి ఘాతుకానికి ఒడిగడితే అది ఇంకా శోచనీయమైన విషయం!
        ‘దుఆ’ కూడా ఒక ఆరాధన లాంటిది. ఆరాధనలన్నీ అల్లాహ్‌ాకే చెల్లుతాయి. అల్లాహ్‌ాను వదలి ఇతరుల్ని మొరపెట్టుకోవటం, వారిని సహాయం చేయమని అర్థించటం, వారిని ఆపద మ్రొక్కువారిగా తలపోయటం ”షిర్కె జలీ” (బహిరంగ బహుదైవారాధన) అవుతుంది. దేవుడు దాన్ని ఎన్నటికీ మించడు.
        విశ్వాసి చేతిలో ‘దుఆ’ ఆయుధం వంటిది. దాని ముందు పెద్ద పెద్ద ఆయుధాలు కూడా పనికిరాకుండా పోతాయి. హృదయావేదనకు ఉపశమనం, బాధితులకు ఆధారం, భయాందోళనలకు గురయిన వారికి అభయ హస్తం దుఆ!

        బాధితుని శాపం సప్తాకాశాలనూ చీల్చుకుని వెళుతుంది

        బాధితుని నోటి నుండి వెలువడే దుఆ అంతరిక్షాన్ని, సప్తాకాశాలనూ చీల్చుకుంటూ దైవ సన్నిధికి వెళ్ళి బాధితునికి సహాయం అందేలా చేస్తుంది.

        దుఆ ఎన్నడూ త్రోసిపుచ్చబడదు!



          దాసుడు చేసే దుఆ ఎట్టి పరిస్థితిలోనూ త్రోసిపుచ్చబడదు. దాసుని దుఆ ఒక్కోసారి వెంటనే దైవ సన్నిధిలో స్వీకృతికి నోచుకుంటుంది. లేదా దాని మూలంగా అతనికి రాబోయే ఆపదలు, గండాలు తప్పి పోతాయి. లేదా ఆ దుఆ అతని పరలోక జీవితం కొరకు నిక్షేపంగా ఉంచబడుతుంది.

          తీర్చి దిద్దిన తీరు చూడు!


          మహా ప్రవక్త ముహమ్మద్‌ (స ) ప్రజల జీవితాలను తీర్చి దిద్దటానికి, ఆంతర్యాలను పరిశుద్ధ పరచటానికి పూనుకున్నప్పుడు రకరకాల జనులు ఆయన (స ) ముందున్నారు. ధనికులతోపాటు పేదవారు కూడా ఉన్నారు. పండితులతో పాటు పామరులు కూడా ఉన్నారు. నాగరికులతో పాటు అనాగరికులు కూడా ఉన్నారు. మానవ మహోపకారి అయిన ప్రవక్త (స ) అందరినీ శ్రద్ధగా గమనిస్తూ ఉండేవారు. వారి పరిస్థితిని బట్టి విషయం అర్థమయ్యేలా చెప్పేవారు.

          ఒక న్యూ ముస్లిం

          ముఆవియా బిన్‌ హకమ్‌ సులమీ ప్రవక్త సహచరులలో ఒకరు. ఈయన అప్పుడప్పుడే ఇస్లాంలో చేరిన న్యూ ముస్లిం సహాబీ. అంతకు ముందు ఆయన ఇస్లాం మర్యాదలను గురించి విని ఉన్నారు. ఎవరయినా తుమ్మి ‘అల్‌హమ్దులిల్లాహ్‌ా’ అని పలికినపుడు, దానికి జవాబుగా ‘యర్‌హముకల్లాహ్‌ా’ అని చెప్పటం ధర్మం అన్న విషయం ఆ న్యూ ముస్లిం సహాబికి తెలుసు. సామూహిక నమాజు వేళ కాగానే అందరూ నమాజుకు ఉపక్రమించారు. ఆ న్యూ ముస్లిం సహాబి కూడా అందరితో కలిసి నమాజుకు నిలబడ్డారు. నమాజు మధ్యలో ఎవరికో తుమ్ము వచ్చింది. అంతే! దానికి సమాధానంగా ముఆవియ (ర ) ‘యర్‌హముకల్లాహ్‌ా!’ అని బిగ్గరగా అనేశారు. కొంతమంది సహాబా ఆయన్ని తీక్షణంగా చూశారు. ‘అదేంటీ, మీరంతా నన్ను అలా చూస్తారేమిటి?’ అని ముఆవియ (ర ) నమాజులోనే అడిగేశారు. అప్పుడు సహాబీలలో కొందరు కాళ్ళపై చేతులు చరిచి ‘సుబ్‌హానల్లాహ్‌ా’ అన్నారు. ‘ఓహో! నమాజులో ఇలా మాట్లాడకూడదు కాబోలు’ అనుకుని మౌనం వహించారు ముఆవియా.సలాం చెప్పి నమాజు ముగించిన తర్వాత దైవప్రవక్త (స ) వెనుతిరిగి, ”నమాజు మధ్యలో మాట్లాడిందెవరు?” అని అడిగారు. జనులంతా ముఆవియా వైపు సైగ చేశారు.
          ఆ సన్నివేశాన్ని ముఆవియ (ర ) మాటల్లోనే దర్శించండి – ఆయన ఇలా అన్నారు: ”నా తల్లిదండ్రులను దైవప్రవక్త (స ) కు అర్పింతు! నేను ప్రవక్త (స ) వారిని మించిన సంస్కర్తను అంతకుముందుగానీ, ఆ తర్వాత గానీ ఎక్కడా చూడలేదు. ఆయన (స ) నన్ను కోప్పడలేదు సరి కదా, ఆప్యాయంగా నన్ను దగ్గరకు పిలిచి, ”ఇది నమాజు నాయనా! నమాజులో మాట్లాడకూడదు కదా! నమాజులో ఖుర్‌ఆన్‌ పఠించ బడుతుంది. దైవనామం స్మరించబడుతుంది. దైవ కీర్తన జరుగుతుంది” అని మాత్రం సుతిమెత్తగా చెప్పారు.

          సభ్యతా సంస్కారాల సరోవరం నమాజు

          నమాజ్‌ విశ్వాస (ఈమాన్‌) మాధుర్యం. అది ఆత్మకు ఆహారం. హృదయానికి శాంతిని, నెమ్మదిని ఇచ్చే అరుదైన టానిక్కు. దాంతో పాటు అది ముస్లింల సామూహిక, నైతిక, సంస్కృతీ నాగరికతల సంస్కరణకు దోహదపడే అత్యుత్తమ పరికరం కూడా. అంతిమ దైవప్రవక్త (స ) ద్వారా ప్రజా బాహుళ్యంలో వచ్చిన సామాజిక, నైతిక పరివర్తనలో కీలక పాత్ర పోషించింది నమాజే అంటే అతిశయోక్తి కాదు. వస్త్రధారణపై బొత్తిగా అవగాహన లేని అరబ్బు అనాగరికులను ఇస్లాం కొన్నేండ్లలోనే సభ్యతాసంస్కారాల ఉన్నతికి చేర్చిందంటే అందులో నమాజ్‌ నిర్వహించిన భూమిక అంతా ఇంతా కాదు.
          ఎందుకంటే నమాజు చేసే వ్యక్తి నగ్నంగా గానీ, అర్థ నగ్నంగా గానీ, ఉండలేడు. ముఖ్యంగా అతను తన మర్మస్థానాలను పరిశుభ్రమైన దుస్తులతో మరుగు పరచాలి. శరీరంలోని నిర్ణీత భాగంపై సతర్‌ (ఆచ్ఛాదన) ఉండాలి. అరేబియాలోని పల్లెటూరి బైతులకు ఈ సంస్కారం లేకుండింది. ఆఖరికి పట్టణాలలో నివసించేవారు కూడా వస్త్రధారణ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. కురైషు మహిళలు హజ్‌ చేసినప్పుడు-నగ్నంగా-కాబా ప్రదక్షిణ చేసేవారు.
          అయితే ఇస్లాం రాగానే శరీరంపై ఆచ్ఛాదనను అనివార్యంగా ఖరారు చేసింది. శరీరాచ్ఛాదన లేకుండా చేసే నమాజ్‌ నెరవేరదని ప్రకటించింది-
          ”ఓ ఆదం సంతతి వారలారా! మీరు (నమాజు నిమిత్తం) మస్జిదులకు వచ్చిన ప్రతి సారీ మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి”. (అల్‌ ఆరాఫ్‌ – 31)
          నమాజులో పురుషులైతే కనీసం నాభి నుంచి మోకాళ్ళ క్రింది వరకు శరీరాన్ని వస్త్రంతో కప్పి ఉంచటం తప్పనిసరి. స్త్రీలకయితే నఖశిఖపర్యంతం ఆచ్ఛాదన ఉండి తీరాలి. ఈ విషయాన్ని ఇస్లాం రోజుకు ఐదు సార్లు మరీ మరీ జ్ఞాపకం చేసి తన అనుయాయుల్లో నిద్రాణమై ఉన్న లజ్జాబిడియాలను తట్టి లేపుతుంది. నాగరికతకు ఆమడ దూరాన ఉండే ఆఫ్రికా ఖండంలోని ఆటవికులు, ఆది వాసులు సయితం నమాజు వల్ల సభ్యతాసంస్కారాలకు అలవాటు పడ్డారు.

          నమాజు వల్ల సభ్యతాసంస్కారాలకు అలవాటు పడ్డారు.